చిత్రగుప్తుడి చిట్టాలో చిత్రాలెన్నో!

చిత్రగుప్తుడి చిట్టాలో చిత్రాలెన్నో! - Sakshi


 సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: మోహన్‌రెడ్డి పైనాన్స్ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ చెప్పిన లెక్కలు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి. కీలక పత్రాలతో ఉడాయించిన జ్ఞానేశ్వర్ దొరికితే అక్రమ ఫైనాన్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారు బయటకు వస్తారని భావించగా, ఆయన చెప్పిన మాటలకు.. ఇక్కడి లెక్కలకు మధ్య తేడా ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సీఐడీ రిమాండ్ నివేదికలో పేర్కొన అంశాలు పరిశీలిస్తే జ్ఞానేశ్వర్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు అంత కీలకం కాదని తెలుస్తోంది. అయితే, జ్ఞానేశ్వర్ విలువైన పత్రాలను దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. 15 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న అతను హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో సంచరించినట్లు అనుమానిస్తున్న పోలీసులు పత్రాలను ఆయా ప్రాంతాల్లోనే దాచి ఉంచాడని భావిస్తున్నారు. రాయలసీమలోని పలువురు ఫ్యాక్షన్ నేతలతో మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉండటంతో జ్ఞానేశ్వర్ వ్యూహాత్మకంగా తిరుపతి వరకు వెళ్లి వారివద్దే ఈ డాక్యుమెంట్లు ఉంచారని ప్రచారం జరుగుతోంది.



 చిట్టాలో చిత్రాలెన్నో...

 సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పలువురు పోలీసు అధికారులతో పాటు వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టినట్లుగా జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. కానీ, వాటిని మొత్తం కలిపితే రూ.3.84 కోట్లుగా తేలింది. కానీ, అదే నివేదికలో మోహన్‌రెడ్డి నుంచి పలువురు ప్రముఖులు, ఉద్యోగులు తీసుకున్న అప్పు రూ.8.34 కోట్లుగా తేలింది. అట్లాంటప్పుడు మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం అందులో పేర్కొనలేదు. ఇవేకాకుండా వందలాది ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇళ్లు మోహన్‌రెడ్డి, ఆయన బినామీల పేరిట ఉన్నాయి.  జ్ఞానేశ్వర్ నుంచి రాబట్టిన సమాచారం చూస్తే... మోహన్‌రెడ్డి దందాకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోనే కాకుండా నిర్మాతలకు సంబంధించిన ఆస్తులనూ తనఖా పెట్టుకుని సుమారు రూ.200 కోట్ల వరకు అప్పులిచ్చాడని ఆరోపణలున్నాయి. అయితే,జ్ఞానేశ్వర్ చెప్పిన వివరాలు చూస్తే పొంతనే లేకుండా ఉంది.



 జ్ఞానేశ్వర్ నోటి వెంట... కిరణ్‌రావు మాట

 జ్ఞానేశ్వర్ నోట రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్‌రావు పేరు రావడం చర్చనీయాంశమైంది. మోహన్‌రెడ్డికి కిరణ్‌రావు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అతని సూచనల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఎన్నికల ముందు రూ.3 కోట్లు అప్పు ఇచ్చారని రిమాండ్ షీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదారాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కిరణ్‌రావు నుంచి మరి కొంతమందికి కూడా మోహన్‌రెడ్డి పెద్ద మొత్తంలో అప్పులిప్పించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు తాజాగా కిరణ్‌రావు వ్యాపారాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.



 మోహన్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు

 ఏఎస్సై మోహన్‌రెడ్డి రిమాండ్‌ను న్యాయమూర్తి అజహర్ హుస్సేన్ పొడిగించారు. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్‌ను న్యాయమూర్తి మరో 14రోజులు పొడిగిం చారు. దోనపాటి వెంకట రమణారెడ్డిని ఆస్తుల ను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడు మోహన్‌రెడ్డి బినామీ పూర్మ శ్రీధర్‌రెడ్డి బెయిల్ ఫిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణ ఈనెల 30కి వాయిదా వేశారు.

 

 విచారణ ముందుకు సాగేనా..?

  ఈ కేసులో సీఐడీ అధికారులకు కొత్తగా రాజకీయ ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. విచారణ మరింత లోతుగా వెళితే బడా వ్యాపారులు, ఎస్పీ స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని, అదే జరిగితే ఇబ్బందని భావిస్తున్న సదరు నేతలు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో  కేసును నీరుగార్చేలా సీఐడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పెద్ద నేతతో మంతనాలు చేశారని, అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సీఐడీ దూకుడుకు కళ్లెం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మోహన్‌రెడ్డిపై ఫిర్యాదులు చేసిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏసీబీకి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రతి రోజు 5 నుంచి 7 ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top