మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత

మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత


13 మందికి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స

వైరస్ వల్లేనన్న చొప్పదండి   ఎస్‌పీహెచ్‌వో రవీందర్


చొప్పదండి/కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్‌లో పదమూడు మంది విద్యార్థులు  మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యాలయంలో ప్రార్థన అనంతరం ఒకరి వెంట ఒకరికి విపరీతమైన దగ్గు రావడంతో వారిని ఆటోలలో చొప్పదండి పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు చంద్రశేఖర్, శ్రీకర్ ప్రాథమిక చికిత్స జరిపారు. విద్యార్థులకు చికిత్స చేసే సమయంలో అక్కడ ఉన్నవారికి కూడా దగ్గు మొదలైంది. ఏదో వైరస్ వ్యాపిస్తోందని గ్రహించి ఆస్పత్రిలో ఉన్న అందరికి మాస్కులు ధరింపజేశారు. విద్యార్థులు దగ్గుతూ ఆయాసపడటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యాధికారులు రెండు అంబులెన్‌‌సలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని తెలిపారు.



వారందరిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యచికిత్స అందిస్తున్నట్లు ఇన్‌చార్జి ఆర్‌ఎంవో శ్రీధర్ తెలిపారు. పలువురు విద్యార్థులు సాయంత్రం వరకు కోలుకోగా వారి తల్లిదండ్రులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. మరో ఇద్దరు ముగ్గరు విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వారాల క్రితం శిరీష, అంజలి అనే  ఇద్దరు విద్యార్థినులకు ఆస్తమా సోకిందని, వారిని వైద్యం కోసం ఇంటికి పంపించామని, పూర్తిగా నయం కాకుండానే తిరిగి కళాశాలకు రావడంతో మిగిలిన వారికి సోకిందని ప్రిన్సిపాల్ వరప్రసాద్‌చారి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మాడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీహిత, శిరీష, పూజ, సమత, శైలజ, సమత, శిరీష, సమత, అక్షిత, అఖిల, అంజలి, తొమ్మిదవ తరగతి విద్యార్థి కావేరి, ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి సుష్మిత ఉన్నారు.



విషయం తెలిసిన వెంటనే ఎస్‌పీహెచ్‌వో రవీందర్ మాడల్ స్కూల్‌ను సందర్శించి వైరస్ ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. శిరీష, అంజలి ఎక్కువ అస్వస్థకు గురయ్యారని, వారి ద్వారా వైరస్ ఇతరులకు సోకిందని చెప్పారు. శీతాకాలం కావడం, డార్మెటరీలో అపరిశుభ్రత ఉండటం, విద్యార్థులకు సరైన పోషకాలు అందక బలహీనంగా ఉండటం కూడా కారణమని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో అన్వర్, ఎంఈవో రాజాస్వామి, సీఐ లక్ష్మిబాబు విద్యార్థులకు అందుతున్న చికిత్సను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top