9న ఆదర్శ హాస్టళ్లను ప్రారంభించాలి

9న ఆదర్శ హాస్టళ్లను ప్రారంభించాలి - Sakshi

కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన హాస్టళ్లను ఈ నెల 9న ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ చల్లా విజయమోహన్‌ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కూళ్లకు అప్రోచ్‌ రోడ్లు, గ్రౌండ్‌ లెవెలింగ్, మొక్కల పెంపకంపై కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులు, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్, ప్రిన్సిపాళ్లు, ఏపీడబ్ల్యూడీసీ అధికారులతో సమీక్షించారు. హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు ఎంపీడీఓ, ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లతో నమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏపీడీలకు కేటాయించిన పనులు పూర్తి చేయడంలోతీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఇకపై నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల్లోపు పనుల్లో పురోగతి చూపించాలన్నారు. పనులు జరుగుతున్న స్కూళ్లను డీఈఓ సక్రమంగా తనిఖీ చేయడం లేదని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, స్కూళ్లలో ఉపాధి నిధులతో చేపట్టిన పనులు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మీరు నా ఓపికను పరీక్షిస్తున్నారని, చేతకాకపోతే మాతో కాదు అని చెబితే మరొకరితో చేయించుకుంటామని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తమకేమి పట్టనట్లు వ్యహారిస్తున్నారని, ఇకపై అలాంటి అభిప్రాయాలను మానుకుని పాఠశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటే సరిపోతుందో తెలియజేయాల్సిన అవసరం మీపై ఉందన్నారు. జిల్లాలోని ఆదర్శ స్కూళ్లను విభజించి డిప్యూటీ డీఈఓలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. హాస్టల్‌ రన్‌ కాకపోతే సంబంధిత ప్రిన్సిపాల్, డిప్యూటీ డీఈఓలదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డిప్యూటీ డీఈఓలు, ఏపీడీలు, పీఆర్‌ ఏఈఈలు, ఆదర్శ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top