పరారీలో పగటి వేషగాళ్లు..

పరారీలో పగటి వేషగాళ్లు.. - Sakshi


ఎమ్మెల్యే కుటుంబం ఫిర్యాదుతో

జ్యోతిష్యం కార్యాలయాల మూత




పరకాల: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల పట్ల ఉన్న నమ్మకాన్ని ఆసరా చేసుకున్న కొందరు పగటి వేషగాళ్ల ఉచ్చులో అమాయక ప్రజలు చిక్కుకుంటున్నారు. ఫలితంగా వారికి వేలాది రూపాయలు సమర్పించుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాల్లో సాక్షాత్తు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబం ఒకటి కావడం సంచలనంగా మారింది. వాస్తవానికి కొయదొరల పేరిట రాష్ట్రంలోని అనేక జిల్లాలో మోసాలు జరుగుతున్న బయటకు రావడం లేదు. నాలుగైదు సంవత్సరాలుగా వీరి మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాము చేసిన తప్పుకు పశ్చాతాపం పడుతూ ఇలాంటి పరిస్థితి మరొకరికి రావొద్దని ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పగటి వేషాగాళ్లు పరారీలో ఉన్నారు.



పరకాలలో జ్యోతిష్య కార్యాలయాలు

కొయదొరల ముసుగులో పరకాల పట్టణంలో కొందరూ ఏకంగా కార్యాలయాలు తెరిచారు. కార్యాలయాల వద్ద ఆకర్షించే విధంగా ప్లెక్సీలు, సమాచారాన్ని ఏర్పాటు చేశారు. సమాచారంలో ఎలాంటి వ్యాధులైనా తమ వద్ద ఉన్న మూలికలతో నయం చేయడంతో పాటు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుతామని పేర్కొన్నారు.  



ఎదుటి వారి బలహీనతే ఆసరా..

కొయదొరల్లా కనిపించేల్లా వేషాలు వేసుకుని తెల్లవారుజామున 5గంటల సమయానికి కొందరు ద్విచక్రవాహనాలపై పట్టణంలోని ముందుగా అనుకున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఎవరు ఏ గ్రామానికి ..ఎక్కడికి వెళ్లాలో ముందే నిర్ణయించుకున్న విధంగా బయలుదేరుతారు. వారి బుట్టలో ఏవరైనా పడితే సమీపంలోని తమ జ్యోతిష్యకార్యాలయాలకు చేరుకోవాలని సూచి స్తారు. జ్యోతిష్యం ఉచితంగా చూస్తామంటునే జ్యోతిష్యం చూసే సమయంలో ఎదుటి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని భవిష్యత్‌లో మీ కుటుంబంలో ఏదో కీడు జరుగపోతుందని చెప్పుతారు. దానికి కావాల్సిన మంత్రం మా గురువుల దగ్గర ఉంటుంది. యంత్రాలకు పూజలు చేయాలంటే కొంత ఖర్చు అవుతుందని నమ్మబలుకుతారు. ఫలితంగా భయంతో అమాయకుల నుంచి ఎంతటి వారైనా వారి వలలో చిక్కుకోవాల్సిందే.  

ప్రచారం కోసం వేలల్లో ఖర్చు

జ్యోతిష్యం పేరిట కొందరు కేబుల్‌ టీవీలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారాన్ని చూసిన ప్రజలు  మోసపోతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిష్యం చూడటానికి డబ్బులు తీసుకునేది లేదంటునే నెలల కొద్ది టీవీల్లో ప్రచారం కోసం వేలాది రుపాయాల ఖర్చుచేస్తున్నారు. ఇంత డబ్బు వీరికి ఎక్కడి నుంచి వస్తుందంటే వీరి  వలలో పడిన వారిదేనని తెలుస్తోంది. అయితే జ్యోతిష్యం పేరిట టీవీల్లో ప్రచారాలు వస్తున్న పోలీసు శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.  



ఎవరీ లక్ష్మణ్‌ రాజ్‌..

కొయదొరల్లో మూలిక వైద్యంలో పేరున్న వ్యక్తి లక్ష్మణ్‌రాజ్‌. తనను ఆశ్రయించి వారి రోగ నివారణ కోసం అడవిలోని మూలికలు సేకరించి నాటు వైద్యం చేసేవాడని, అతడు మృతి చెందన అనంతరం కూడా కొందరు లక్ష్మణ్‌రాజ్‌ పేరును వినియోగించుకుంటున్నట్లు సమాచారం. నగరంలోని కరీమాబాద్‌కు చెందిన కొందరు  ముఠాగా ఏర్పడి లక్ష్మణ్‌ రాజ్‌ పేరునే వినియోగించుకుంటున్నారు. హస్తం నర్సింగరావు, పాస్తరం రాజులు సైతం లక్ష్మణ్‌ రాజ్‌ పేరు చెప్పుకోవడం గమనార్హం.



మోసం చేసిన కేసులో ఇద్దరి అరెస్ట్‌

వరంగల్‌: పూజల పేరిట డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులు పస్తం నర్సింహరాజు, పస్తం రాజులను అరెస్టు చేసినట్లు సుబేదారి సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి కూతురు సంరెడ్డి మానసరెడ్డి వద్ద కోయదొరల పేరుతో పూజల కోసం దఫాలుగా రూ.57లక్షలు వసూలు చేశారని తెలిపారు. మళ్లీ డబ్బులు కావాలని ఈనెల14వ తేదీన మానసరెడ్డిని అడగడంతో ఆమె మామ సంరెడిŠడ్‌ బాల్‌రెడ్డికి అనుమానం వచ్చి వీరి గురించి విచారించడంతో అసలు విషయం బయట పడిందన్నారు. కోడలు మానసరెడ్డి వద్ద పూజల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఆరెస్టు చేసిన నర్సింహరాజు, రాజుల వద్ద నుంచి డబ్బులు పూర్తిగా స్వాధీనం చేసుకొని కోర్టు హాజరు పర్చగా న్యాయమూర్తి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top