వడివడిగా భగీరథ

వడివడిగా భగీరథ - Sakshi


► డిసెంబర్‌ నాటికి ఇంటింటికీ నల్లా కనెక్షన్‌

► నల్లా కనెక్షన్‌కు రూ.40,854 లక్షలు కేటాయింపు

► తీరనున్న 22 మండలాల ప్రజల దాహార్తి




‘మిషన్‌ భగీరథ’ వడివడిగా సాగుతోంది. డిసెంబర్‌ నాటికి ‘ఇంటింటికీ నల్లా’ కనెక్షన్‌ జారీ చేసే దిశగా పనులు వేగం అందుకున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌ భగీరథకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్లా కనెక్షన్‌ ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ప్యాకేజీల ఖరారులో కొంతమేర జాప్యం జరిగినా.. ఈ నెలాఖరులోపు వాటిని కొలిక్కి తేవడం ద్వారా నిర్ణీత వ్యవధిలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది.


అలాగే ప్రజల ముంగిటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన సర్కారు... ఇంటర్నెట్‌ వినియోగించేందుకు వీలుగా అన్ని ఇళ్లకు లైన్‌ వేయనుంది. నల్లాల కనెక్షన్‌ కోసం తవ్వే భూగర్భ పైప్‌లైన్‌లోనే ఇంటర్నెట్‌ ఓఎస్పీ కేబుల్‌ వేయనుంది. మిషన్‌ భగీరథ కింద జిల్లాలో ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చేందుకు రూ.40,854.27 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో 22 మండలాల(రెవెన్యూ)  ప్రజల దాహార్తి తీర్చనుంది. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి



సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్‌ సర్కారు వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు సంబంధం లేకుండా... ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ జారీ చేసేలా భగీరథను రూపొందించింది. ఈ మేరకు జిల్లాలోని 1,056 ఆవాసాలకు నీటిని సరఫరా చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. వాయువేగంతో పైప్‌లైన్లను వేస్తోంది. మిషన్‌ భగీరథ పనులను 33 ప్యాకేజీలుగా విభజించిన పంచాయతీరాజ్‌శాఖ.. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలాప్రణాళికను అమలు చేస్తోంది.



2.19 క్షల ఇళ్లకు నల్లా కనెక్షన్‌

జిల్లాలోని ఆరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,056 ఆవాసాలలోని సుమారు పది లక్షల జనాభా నివాసముంటున్న 2,19,211 గృహాలకు నల్లా కనెక్షన్‌ జారీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 853 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులతో 2,093.54 కి.మీ.మేర పైప్‌లైన్ల ద్వారా వీటికి నీటి సరఫరా చేయాలని ప్రతిపాదించింది.


అయితే, జిల్లావ్యాప్తంగా నిర్మించతలపెట్టిన 853 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల్లో 50శాతం వాటికీ ఇంకా టెండర్లు ఖరారు కాకపోవడం అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తోంది. ఇంకా ఖరారు కానీ టెండర్లను ఈ వారంలోపు పూర్తి చేయకపోతే గడువులోగా భగీరథను పూర్తి చేయడం సాధ్యంకాదని యంత్రాంగం అంటోంది. ఈ నేపథ్యంలో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణ పనులను మూడు కేటగిరీలుగా విభజించింది. జూన్‌లోపు కొన్ని, సెప్టెంబర్‌ ఇంకొన్ని, డిసెంబర్‌లో మరికొన్నింటిని పూర్తి చేయాలని నిర్దేశించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top