ఆరోపణలను తిప్పి కొట్టలేకపోయారు

ఆరోపణలను తిప్పి కొట్టలేకపోయారు - Sakshi


♦ మంత్రులు, టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి అసహనం

♦ ‘తుని’ కేసులో ముద్రగడ తప్ప మిగిలిన వారి అరెస్టుకు యోచన

 

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విజయవాడ: కాపుల ఆందోళన సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర పార్టీలు, వివిధ కుల సంఘాలు తనపై చేసిన ఆరోపణల  దాడిని మంత్రులు, టీడీపీ నేతలు సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌లో సభ్యుల నియామకం, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై క్యాంప్ ఆఫీసులో బుధవారం ఆయన నారా లోకేష్‌తోపాటు మంత్రులతో సమీక్ష జరిపారు. కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు దీటుగా ఎదుర్కోలేకపోయారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.



కాపు కమిషన్‌లో ముద్రగడ పద్మనాభం నుంచి నాలుగు పేర్లు తీసుకుని అందులో ఒకరిని మనమే ఎంపిక చేద్దామని సీఎం చేసిన సూచనను నాయకులు సమర్థించారు. తునిలో రైలు దహనం, పోలీసు స్టేషన్ల కాల్చివేత కేసుల్లో ముద్రగడను తప్పించి, మిగిలిన వారందరినీ ముద్దాయిలు చేస్తేనే పార్టీకి ఉపయోగం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్, ప్రకాష్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరికపై కూడా చర్చ జరిగింది. ఎంత మంది వెళ్లినా పార్టీకి నష్టం లేదనే వాదనతో తెలంగాణలో టీడీపీ కేడర్‌ను నిలుపుకునే ప్రయత్నం చేద్దామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ పాల్గొన్నారు..



 టీడీపీ జిల్లా అధ్యక్షుల మార్పు?

 సాక్షి, హైదరాబాద్:  పలు జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జిల్లా మహానాడుల్లో వీరిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలుగా మారారు. మరికొందరు అంతకు ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలయ్యారు. వీరు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడం, కనీసం సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొనడంతో అధ్యక్షులను మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top