మంత్రిగారి బరితెగింపు


  • తన మాట వినని ఇరిగేషన్ అధికారుల బదిలీ

  • వరదల సమయంలో వద్దని చెప్పినా వీడని పట్టు

  •  ఓ బడా కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు

  •  అధికార దుర్వినియోగం

  •  

  • రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఓ మంత్రికి కోపమొస్తే అధికారుల బదిలీ ఓ లెక్కా! తనకు సంబంధం లేని శాఖలో చొరబడి మరీ అడ్డగోలు బదిలీలకు కారణమయ్యారు మన జిల్లా మంత్రి. ప్రజా సంక్షేమానికి అధికారాన్ని ఉపయోగించాల్సిన ఆయన పంతం నెగ్గించుకోవడానికి జనాన్నే ప్రమాదంలోకి నెట్టే చర్యకు పాల్పడ్డారు. వరదలు వచ్చే అవకాశమున్న ఈ సమయంలో కీలకమైన అధికారుల బదిలీ తగదని ఉన్నతాధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా తన మాట వినని వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు.        

     

     కాకినాడ :‘ఆ అధికారిని సాగనంపాల్సిందే...మంత్రిగా చెబుతున్నా ఆ మాత్రం పనిచేయలేరా... లేదంటే నా పరువు ఏం కావాలి...’ ‘వచ్చే మూడు నెలలు చాలా క్రూషియల్ సర్...వరదలు వచ్చే సమయం..అనుభవం ఉన్న అధికారులుండాలి కదా...కనీసం ఇన్‌చార్జిగానైనా కొనసాగిద్దాం..పంపేస్తే ఇబ్బంది సర్...’ ధవళేశ్వరం నీటిపారుదలశాఖ ఎస్‌ఈ బదిలీ వ్యవహారంలో కేబినెట్‌లో ఒక మంత్రి, ఇరిగేషన్ ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చ ఇది.

     

    ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్‌ఈ ఎస్.సుగుణాకరరావు, ఈఈ తిరుపతిరావును ఈనెల 22న బదిలీ చేశారు. ఎస్‌ఈని తుని ఎల్‌ఎంసీ (లెఫ్ట్ మెయిన్ కెనాల్- పోలవరం)కి, తిరుపతిరావును విశాఖకు బదిలీ చేశారు. ఈఈ ఇక్కడకు వచ్చి నాలుగేళ్లు పైనే అయింది. ఎస్‌ఈ వచ్చి రెండున్నరేళ్లు. ఈ రెండు పోస్టులు గోదావరి వరదల సమయంలో చాలా కీలకం. ఒకటో ప్రమాద హెచ్చరిక సమయంలో ఈఈ, మూడో ప్రమాద హెచ్చరికప్పుడు ఎస్‌ఈ ఫ్లడ్ కన్జర్వేటర్‌లుగా వ్యవహరిస్తారు.


    అనుభవం ఉన్న ఇద్దరినీ ఒకేసారి వరదలు వచ్చే తరుణంలో బదిలీ చేయడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. అందుకే వీరిని బదిలీ చేయవద్దని జిల్లా యంత్రాంగం నీటిపారుదలశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించింది కూడా. అయితే ఇవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ కారణాలతో వారిని సాగనంపాలనే ప్రయత్నాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని ఇరిగేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

     

    మంత్రికి కోపం ఎందుకొచ్చిందంటే...

     కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన ఒక బడా కాంట్రాక్టర్‌తో ఆ మంత్రికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రోయిన్స్ పనులు చేశారు. వాటికి సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మంజూరు చేయాలని కాంట్రాక్టర్ రెండు నెలలుగా తిరుగుతున్నారు. చివరకు మంత్రి ద్వారా ఇరిగేషన్ అధికారులకు సిఫార్సు కూడా చేయించుకున్నారు.


    కానీ పనుల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది. కమిటీ నివేదిక వచ్చే వరకు బిల్లులు మంజూరు చేసే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ఆ కాంట్రాక్టర్ మంత్రి ముందుంచారు. ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. తాను చెప్పిన వారికే పనులు చేయకుంటే ఎవరికి మాత్రం పనులు చేస్తారంటూ ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. ఆ క్రమంలోనే ఎస్‌ఈ, ఈఈల బదిలీలపై ఆ మంత్రి పంతం పట్టారు.

     

     ఉన్నతాధికారుల మాటా భేఖాతరు

     వరదలు ముంచుకొస్తున్న తరుణంలో కదపడం సరికాదని ఇరిగేషన్ ఉన్నతాధికారులు సైతం వాదించారని సమాచారం. ఎస్‌ఈ సుగుణాకరరావు స్థానంలో హైదరాబాద్‌లో నీటిపారుదలశాఖ హెడ్‌క్వార్టర్స్‌లో ఇటీవల ఎస్‌ఈగా పదోన్నతి వచ్చిన అధికారిని నియమించాలని మంత్రి పట్టుబట్టారని తెలిసింది. ఇందుకు సెక్రటరీ స్థాయిలో సానుకూలత లభించకపోవడంతో, మంత్రి అహం దెబ్బతిని ఎట్టి పరిస్థితుల్లోను ఎస్‌ఈని సాగనంపాల్సిందేనని పట్టుబట్టడంతో చేసేది లేక పరిపాలనా సౌలభ్యం పేరుతో అధికారులు ఎస్‌ఈని తుని బదిలీ చేశారు.


    సొంత శాఖలో కింది స్థాయి ఉద్యోగుల బదిలీలలో కూడా ఆయన మాట చెల్లదని జిల్లాలో ఆ మంత్రిగారికి పేరుంది. అటువంటిది మరోశాఖలో అధికారుల బదిలీకి పట్టుబట్టి పంతం నెగ్గించుకోవడం విశేషం. వరదల సీజన్ పూర్తి అయ్యేవరకైనా ఎస్‌ఈని ఇన్‌చార్జిగా కొనసాగించాలని నీటిపారుదలశాఖపై అవగాహన ఉన్నవారు కోరుతున్నారు.


    గోదావరి పరివాహక ప్రాంతం, లంక గ్రామాలు ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ సీజన్‌లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సీడబ్ల్యూసీ హెచ్చరికలు కూడా ఉన్నాయి. 534 కిలోమీటర్ల ఏటిగట్టులో 459 కిలోమీటర్లు పటిష్టం చేశారు. మిగిలిన ఏటిగట్టు వరదల గండాన్ని ఎదుర్కోగలదో లేదో తెలియని పరిస్థితి. బ్యారేజ్‌పై 261 మంది సిబ్బంది ఉండాలి.


    ప్రస్తుతం 41 మంది మాత్రమే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న నీటిపారుదలశాఖ అధికారులు ఉండాలి. కానీ ఒక మంత్రికి కోపం వచ్చిందని వరదల సమయంలో కీలక అధికారులను సాగనంపడం సమంజసమా అనేది జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సంబంధిత శాఖా మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచించాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top