వారు ‘చంద్ర’ శిఖండులు

వారు ‘చంద్ర’ శిఖండులు - Sakshi


టీడీపీ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం

- 2013 చట్టం రద్దు చేయాలని కోరింది మీరు కాదా..?

- మీ మంత్రి అశోక్ గజపతి బిల్లు మీద సంతకం చేసింది నిజం కాదా?

- నేడు ఈ చట్టం అమలు చేయాలనడం ఎంతవరకు సమంజసం

- ఆరునూరైనా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని పునరుద్ఘాటన

 

 గజ్వేల్/సిద్దిపేట జోన్: తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బ్రోకర్లను, శిఖండిలను ఇక్కడికి పంపి కుట్రలు చేస్తున్నాడని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం రాత్రి మెదక్ జిల్లా గజ్వేల్ మండలం సింగాటంలో, సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల దీక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న తెలంగాణ ద్రోహులే.. మళ్లీ కుట్రలకు తెరతీశారని ఆరోపించారు. ‘‘ ఎన్కటికి ఒకడు శుభమాని పెండ్లి పెట్టుకుంటే.. ముక్కుల పుల్ల పెట్టుకుని తుమ్మినట్లుందీ వీళ్ల వ్యవహారం’’ అని రేవంత్ దీక్షనుద్దేశించి వ్యాఖ్యానించారు.



తెలంగాణ అభివృద్ధికి టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకుంటే గోదావరి కిందున్న తన ప్రాంతానికి నీళ్లు వస్తాయని చెప్పి.. తెలంగాణ టీడీపీ నేతలను ఇక్కడికి పంపించారని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యవహారాన్ని ఎగేసి ఆగమాగం చేయడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏరుపడ్డంక మన ప్రాజెక్టులు మనం కట్టుకుందామంటే ఇలా ఎగేసుడేందని ప్రశ్నించారు. 60 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కట్టకపోతిరి.. మీరు చెయ్యని పని మా కేసీఆర్ సారు చేస్తానంటూ ముందుకొచ్చి ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పిస్తే ఈ కుట్రలు ఎందుకంటూ మండిపడ్డారు.



మల్లన్నసాగర్ ముంపు బాధితులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించడానికి 123 జీవోను తీసుకువచ్చామని గుర్తు చేశారు. 2013 చట్టం అమలు చేయాలనే అంటున్నరు.. ఈ చట్టం వద్దంటూ బీజేపీ, టీడీపీ నేతలు లోక్‌సభలో బిల్లు పెట్టలేదా అని మంత్రి ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభలో ఆగిపోలేదా..?, ఈ బిల్లును రద్దు చేయాలని స్వయంగా టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సంతకం పెట్టలేదా అని నిలదీశారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఐదు గ్రామాలు ముంపునకు గురైనా తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు పూర్తిగా సస్యశ్యామలమవుతాయన్నారు. ఆరునూరైనా మల్లన్న ప్రాజెక్టును కట్టి తీరుతామని,  ఏడాదిన్నరలోగా  నీళ్లందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

 

 మైనార్టీ విద్యాసంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్

 ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. గజ్వేల్‌లో పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే రాష్ట్రంలోనే తొలి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం వారిద్దరు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top