ఫేస్‌బుక్ కేటుగాడు నాగభూషణ్

ఫేస్‌బుక్ కేటుగాడు నాగభూషణ్ - Sakshi


యువకుడి ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు

పోలీసుల అదుపులో నిందితుడి తల్లి


ఖాజీపేట (వైఎస్సార్ జిల్లా): ఫేస్‌బుక్  ద్వారా పరిచయమై తన  ఖాతాలో లక్షలు జమ చేయించుకుని ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైన కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటకు చెందిన నరసింహ వరప్రసాద్ అలియాస్ రమేష్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయి ఇచ్చిన బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమచేసి.. ఆ విషయం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. మృతుడి తండ్రి లక్ష్మీనరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం వెళ్లి ఫోన్ నంబర్లు, అకౌంట్ నంబర్ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో సూత్రధారి నాగభూషణ్ అలియాస్ నాగ అనే యువకుడు కాగా పాత్రధారి అనురాధ అనే అమ్మాయి అని పోలీసులు గుర్తించారు.


 

ఎవరీ నాగభూషణ్, అనురాధ.. : విశాఖపట్నానికి చెందిన నాగభూషణ్ 7వతరగతి వరకు చదువుకున్నాడు. ఇతను జీవనోపాధి కోసం ఓ మెస్‌లో పనిచేస్తున్నాడు. ఇతని తల్లి కల్యాణి, అక్క మరో మెస్‌లో పనిచేస్తున్నారు. నాగభూషణ్ ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫొటోలతో ఖాతా తెరుస్తాడు. ఆపై పరిచయమైన వారితో చాటింగ్ చేస్తూ వారికి తన ఫోన్ నంబర్ ఇస్తాడు. ఆ నంబర్ ద్వారా తన స్నేహితురాలు అనురాధతో మాట్లాడిస్తాడు. అలా పరిచయమైన నరసింహకు మాయమాటలు చెప్పి తన తల్లి కల్యాణి పేరుతో ఉన్న బ్యాంకు అకౌంటు నంబర్‌కు సుమారు రూ.1.24 లక్షలు వేయించుకున్నాడు.


 

వారిద్దరికీ ఏమిటీ లింకు.. : కేసు దర్యాప్తులో భాగంగా నాగభూషణ్ తల్లి కల్యాణిని పోలీసులు విచారించగా తన  బ్యాంకు ఏటీఎం కార్డు తన కుమారుడు నాగభూషణ్ వద్ద ఉంటుందని.. అతను ఏం చేశాడో తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నాగభూషణ్ నంబర్‌కు ఫోన్ చేయగా తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు సమాచారం. అయితే నరసింహతో మాట్లాడిన అనురాధ కూడా తనకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైందని ఆమె ద్వారానే తాను ఈ నాటకం ఆడించానని చెప్పినట్లు తెలిసింది.


 

భారీగా ఫోన్‌కాల్స్ : నరసింహకు రోజూ భారీగానే ఫోన్‌కాల్స్ వచ్చేవి. ఈ కాల్‌లిస్ట్‌ను పరిశీలిస్తే ఒక నంబరు నాగభూషణ్‌దికాగా, మరొకటి అతని తల్లి కల్యాణిదని, మరొకటి అతని అక్క నళిణిదిగా పోలీసులు గుర్తించారు. నరసింహ సెల్‌ఫోన్‌కు 80 సార్లు కల్యాణి సెల్ నుంచి, 50 సార్లు నాగభూషణ్ సెల్ నుంచి, 55సార్లకు పైగా నళిణి సెల్ నుంచి ఫోన్‌కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే నిందితుడు నాగభూషణ్ చెబుతున్నట్లు అనురాధ అసలు ఉందా.. లేక తన తల్లి, అక్కతో కలిసి ఈ మోసానికి తెరలేపాడా అనే అనుమానం వ్యక్తమవుతోంది.


 

వివిధ ప్రాంతాల నుంచి వసూళ్లు


కల్యాణి బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు వివిధ ప్రాంతాల నుంచి నగదు వచ్చిపడుతున్నట్లు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటివరకు రూ.2.95 లక్షలు జమ అయినట్లు తెలిసింది. అంటే నరసింహ ఒక్కడి నుంచే కాకుండా ఇంకా పలువురిని ఇలాగే మాయమాటలతో నమ్మించి డబ్బు గుంజినట్లు తెలుస్తోంది.




పోలీసుల అదుపులో కల్యాణి : ఖాజీపేట పోలీసులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా కల్యాణి మంగళవారం ఖాజీపేట పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఆమె తనకేమీ తెలియదనే మాటపైనే నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  కల్యాణితో పాటు ఆమె కొడుకు, కూతురిని కూడా పోలీసు స్టేషన్‌కు రావాలని నోటీసులు ఇస్తే వారిద్దరూ హాజరుకాకుండా తల్లినే పంపడంలోని ఆంతర్యమేమిటనేది అంతుచిక్కడం లేదు. ఏది ఏమైనా ఈ సంఘటనలో నాగభూషణ్ కీలక వ్యక్తి అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటేగానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top