ఇటా.. అటా..

ఇటా.. అటా..

విలీన ‘పంచాయితీ’

- ఎటపాక మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలపై గందరగోళం

- తమకే దక్కుతాయంటున్న తెలంగాణ ప్రభుత్వం

- ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు

- సానుకూలంగానే ఉన్న కేంద్రం?

నెల్లిపాక : రాష్ట్ర విభజన చిక్కులు ఎటపాక మండలాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 21 పంచాయతీలకు ఎటపాకను మండల కేంద్రంగా ప్రకటించడంతోపాటు విలీన మండలాలకు డివిజన్‌ కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రెండేళ్లు కావస్తోంది. విభజన జరిగినప్పటి నుంచి నేటివరకూ ఈ ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతనే ఉంది. కొన్నాళ్ల నుంచి మండల వాసులను మరో సమస్య వెంటాడుతోంది. భద్రాచలం పట్టణానికి సమీపాన ఉన్న ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్టణం, గుండాల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఐదింటినీ తిరిగి తెలంగాణలో కలపనున్నారనే చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ç ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు అనేకసార్లు చెప్పారు కూడా. ఈ ఐదు పంచాయతీలూ తెలంగాణలో తిరిగి విలీనం కానున్నాయని, ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని చెబుతున్నారు.

తెలంగాణ సమస్య ఇదీ..

- ఎటపాక మండలంలోని ఈ ఐదు పంచాయతీలను తెలంగాణ పరిధిలోకి తీసుకురావడం ద్వారానే భద్రాచలం అభివృద్ధి సాధ్యపడుతుందన్నది ఆ రాష్ట్ర పాలకుల అభిప్రాయం.

- ఈ ఐదు పంచాయతీల పరిధిలో 20 గ్రామాలున్నాయి. సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామాల జనాభా 15,041.

- భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతమైన దుమ్ముగూడెం వెళ్లాలంటే పట్టణానికి ఆనుకుని ఉన్న ఏపీలోని ఎటపాక మీదుగా కన్నాయిగూడెం దాటి 8 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ మార్గంలో భద్రాచలం నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ పరిధిలోని రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే తెలంగాణ వాసులకు రహదారి సమస్య తలెత్తనుంది.

- అంతేకాకుండా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 900 ఎకరాల భూమి ఈ పంచాయతీల్లో ఒకటైన పురుషోత్తపట్టణంలోనే ఉంది. రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో ఉండటం ఆ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందనేది వాదన.

- భద్రాచలం పట్టణానికి ఓపక్క గోదావరి నది ఉంది. పట్టణం అభివృద్ధి చెందాలంటే రెండోపక్కనే జరగాలి. కానీ, ఇటువైపు ఉన్న ప్రాంతం ఏపీలో ఉంది. ఇది పట్టణాభివృద్ధికి అవరోధంగా మారింది.

- వీటన్నింటి నేపథ్యంలో ఈ ఐదు పంచాయతీలను తిరిగి కలుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.

ఆంధ్రా సమస్య ఏమిటంటే..

- పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దున ఉన్న అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట (కొంత భాగం), నారాయణపురం, గుమ్మడవల్లి, ఆసుపాక, ఊట్లపల్లి గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి. దీనివలన ఏపీకి రహదారి సమస్య తలెత్తే అవకాశాలున్నాయి.

- ఈ కారణంగా ఈ ఐదు పంచాయతీలను ఏపీలో కలుపుకొని, ఎటపాక మండలంలోని ఐదు పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

- మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు మండలం నుంచి ఐరన్‌ ఓర్‌ను తరలించాలంటే తెలంగాణలోని ఐదు పంచాయతీల మీదుగానే వెళ్లాలి. అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే ఏపీ నుంచి వెళ్లే వాహనాలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.

- ఈ కారణాలతో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునేవిధంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

- ఈ సమస్యపై ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు.

- ఇదే నిజమైతే ఎటపాక మండలం కేంద్రం మళ్లీ నెల్లిపాకగా మారనుంది.

- ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతుందనుకుంటున్న తరుణంలో ఈ సమస్య ముందుకు రావడంతో పాలన తిరిగి కుంటుపడే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top