బొట్టు బొట్టుగా పేదల వైద్యం..ప్రైవేట్‌కు నైవేద్యం!

బొట్టు బొట్టుగా పేదల వైద్యం..ప్రైవేట్‌కు నైవేద్యం! - Sakshi


♦ తాజాగా ‘ఐసీయూ’లు సమర్పయామి   

♦ చంద్రబాబు సర్కారు నిర్ణయం

 

 (గుండం రామచంద్రారెడ్డి)

 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో వైద్య సేవల ప్రైవేటీకరణ పతాక స్థాయికి చేరుతోంది. ప్రభుత్వ వైద్యం, వైద్య విద్య పేదలకు దూరం అవుతున్నాయి. తాజాగా పెద్దాసుపత్రుల్లోని ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు)లనూ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను లీజు పేరుతో కార్పొరేట్ సంస్థలకు  అప్పజెప్పిన సర్కారు.. నెలన్నర క్రితమే రక్త పరీక్షలను, ఎక్స్‌రే పరీక్షలను సైతం ప్రైవేటుకు అప్పగించింది. ఈ  పరిణామాలు వైద్య రంగ నిపుణులను ఆందోళనకు గురిచే స్తున్నాయి. ఈ క్రమంలో ఆయా కార్పొరేట్ సంస్థలకు నిర్వహణకు రూ.కోట్లను  ప్రభుత్వం ముట్టజెబుతోంది.అదే సొమ్మును ప్రభుత్వాసుపత్రులకు వెచ్చిస్తే ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా వైద్యులను నియమించుకోవచ్చు.



ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్ట పరిస్తే పేద రోగులకు పది కాలాల పాటు మెరుగైన వైద్య సేవలందుతాయి. అప్పుడు ప్రైవేటు ఆస్పత్రులూ నియంత్రణలోకి వస్తాయి. రక్త పరీక్షల నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించిన ప్రభుత్వం.. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించింది. ఇదే సొమ్ముతో సుమారు 1,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో  బ్రహ్మాండమైన సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ  బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం.. ప్రైవేటుకు పెద్ద పీట వేస్తోంది.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వెనుకబడిన ప్రాంతాలైన ఒంగోలు, శ్రీకాకుళం, కడపలోని జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి, వైద్య కళాశాలలు (రిమ్స్)గా తీర్చిదిద్దారు.వాటికి అదనంగా వైద్య సీట్లు రావడంతో పాటు మెరుగైన వైద్యసేవలూ అందుబాటులోకి వచ్చాయి.



ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. 300 పడకలున్న జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగిస్తే.. అవి వాటిని వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దుతాయని ప్రభుత్వం చెపుతోంది. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలోకు కట్టబెట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, తెనాలి, మచిలీపట్నం, ప్రొద్దుటూరు, నంద్యాల వంటి జిల్లా ఆస్పత్రులనూ ప్రైవేటుకు అప్పజెప్పేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల ప్రభుత్వాసుపత్రులపై  ప్రైవేటు ఆధిపత్యం పెరిగి, పెద్దాసుపత్రులకు రోగులు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు వస్తాయన్న  ఆందోళన నెలకొంది.



 వైద్య విద్య కూడా..:ఒకపక్క ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఆయా యాజమాన్యాలు ప్రైవేటు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకునేందుకు, అదనంగా సీట్లు పొందేందుకు ప్రభుత్వం మార్గం సుగ మం చేస్తోంది. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని చంద్రబాబు ప్రభుత్వం అపోలోకు అప్పగించడం వల్ల ఆ యాజమాన్యం 150 ఎంబీబీఎస్ సీట్లను సొంతం చేసుకుంది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో ప్రతిభగల పేద విద్యార్థులకు అవకాశం లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో కూడా ప్రతిభ ఆధారంగా 10 శాతం సీట్లు ‘బి’ కేటగిరీ కింద ఇచ్చేవారు. ప్రైవేటు పరం అవుతున్న కొద్దీ ఆ సీట్లను ఎత్తేశారు. అంటే ‘బి’ కేటగిరీ సీట్లు కూడా ప్రైవేటు పరం (యాజమాన్య కోటాలోకి వెళతాయి) అవుతాయి. అప్పుడు యాజమాన్యాలు వాటిని కూడా బేరానికి పెట్టుకునే వీలు కలుగుతుంది. యాజమాన్య కోటా సీటు వార్షిక ఫీజు రూ.5.5 లక్షలు ఉండేది. దాన్ని రూ.11 లక్షలకు పెంచేశారు. ‘బి’ కేటగిరీని ఎత్తేయడంతో ప్రతిభగల పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించగలరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.



 డీమ్డ్‌కు రాచబాట : ఇక రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి విశాఖలోని గీతం మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదా కల్పించారు. ఈ కళాశాలల వల్ల వచ్చే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆయా కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు ఉండవు. పరీక్షల నిర్వహణ నుంచి, సీట్ల భర్తీ వరకు  యాజమాన్యం చేతుల్లోనే ఉంటుంది. ఫీజులు కూడా అదే నిర్ణయిస్తుంది. గీతంకు డీమ్డ్ హోదా కల్పించిన కొద్దిరోజులకే రాష్ట్ర మంత్రి నారాయణ తన కళాశాలకూ డీమ్డ్ హోదా ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. మరికొన్ని కళాశాలలు కూడా డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకునే ఏర్పాట్లలో ఉన్నాయి. దీనివల్ల రాష్ర్టంలో వందలాది ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లు పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు దక్కకుండా పోతాయి. గీతంకు ‘డీమ్డ్’ హోదా ఇవ్వడం సరికాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు.. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యంను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అప్రధాన శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ పూనం మాలకొండయ్య ప్రభుత్వ పెద్దల సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే విమర్శించడం గమనార్హం.

 

 ప్రైవేటు సంస్థలకు ఇలా..

► చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని చంద్రబాబు ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి అప్పజెప్పింది.

► పీహెచ్‌సీలు మొదలుకుని బోధనాసుపత్రుల వరకు రక్తపరీక్షల నిర్వహణ బాధ్యతలను మెడాల్ అనే ప్రైవేటు సంస్థకు ఇచ్చింది. ఆయా ఆస్పత్రుల్లో రేడియాలజీ సంబంధిత సేవలను శ్రీకృష్ణా డయాగ్నిస్టిక్స్ అనే సంస్థకు కట్టబెట్టింది.

► గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సహృదయ ఫౌండేషన్‌కు, విశాఖ కింగ్‌జార్జిలో కేర్ ఆస్పత్రికి అప్పజెప్పింది.

► ఎన్టీఆర్ వైద్యసేవకు డాక్టర్ల కొరత ఉండగా ఆ ఖాళీలను భర్తీ చేయడానికి బదులు ప్రైవేటు వైద్యులతో పని కానిచ్చేద్దామని నిర్ణయించింది.

► గ్రామాల్లో సేవలందించే ‘104’ సంచార వైద్యశాలలను ప్రైవేటుకు ఇచ్చేందుకు ఇప్పటికే టెండరు ఖరారు చేసింది.

► ఇక వైద్య పరికరాల నిర్వహణను కూడా ఏటా రూ.35 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది. తాజాగా సరిగా నిర్వహించలేక పోతున్నామనే పేరిట ప్రాణాపాయ స్థితిలో అత్యవసర వైద్య సేవలను అందించే ఐసీయూలనూ పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో ప్రైవేటుకు ఇవ్వాలని  నిర్ణయించింది.

 

 ప్రైవేటీకరణతో నష్టాలు

 ప్రభుత్వ ఆస్పత్రుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తులో యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశముంటుంది.

► డయాగ్నిస్టిక్స్ సేవలు ప్రైవేటుకు అప్పగించడం వల్ల  పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు మొదలుకొని అన్ని ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు వంటి నియామకాలు పూర్తిగా నిలిచిపోతాయి.

► ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ప్రైవేటుకు ఇస్తే అనస్థీషియన్‌లు తదితర డాక్టర్ల నియామకాలు నిలిచిపోతాయి.

► రక్తపరీక్షల నిర్వహణ తీసుకున్న సంస్థ నిబంధనల ప్రకారం సొంతగా లేబొరేటరీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా.. ఫ్రాంచైజీలుగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది. పరీక్షలు ప్రైవేటుపరమై రెండు నెలలవుతున్నా ఎవరికీ సరిగా సేవలు అందడం లేదు.

► ఖాళీ చిట్టీలు (ప్రిస్కిప్షన్‌లు) ఇవ్వాలని, వాటిలో వైద్యపరీక్షలు ఏంటనేవి తామే రాసుకుని బిల్లులు పెట్టుకుంటామని ప్రైవేటు సిబ్బంది ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలా అవసరం లేని పరీక్షలు చేసేందుకు, అసలు పరీక్షలు చేయకుండానే బిల్లులు పెట్టుకునేందుకు అవకాశం చిక్కుతోంది. ఇందుకు ప్రతిగా డాక్టర్లకు దుబాయ్, సింగపూర్ పర్యటనలను ఆఫర్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

► చిత్తూరు ఆస్పత్రిలో ఓ రోగి రక్త నమూనాకు పరీక్షలు చేయకుండానే థైరాయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. బయట మళ్లీ పరీక్ష చేయించుకోగా అక్కడ లేదని తేలింది. ప్రైవేటు సంస్థ నిర్వహణ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ.

► ఇక ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చేవారిని ప్రైవేటు వారికి అప్పగిస్తే వారి పరిస్థితి ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top