రూ.104కోట్లు ,104రోజులు

రూ.104కోట్లు ,104రోజులు - Sakshi


సమీపిస్తున్న మేడారం మహాజాతర

ఇంతవరకూ టెండర్లు దాటని పనులు    

ఎప్పటిలాగే జాతర ముందే ప్రారంభం

నాణ్యత లేకుండా కొనసాగుతున్న వర్క్స్‌

కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా వచ్చినా  మారని అధికారుల తీరు




మహాజాతర గడువు సమీపిస్తోంది. జాతరకు మరో 104 రోజులు మిగిలి ఉండగా.. ఖర్చు చేయాల్సిన డబ్బులు రూ.104 కోట్లు ఖజానాలో మూలుగుతున్నాయి. ఎప్పటి పనులు అప్పుడే చేసి నిధులు వృథా చేసే అలవాటున్న అధికారులు ఈసారి కూడా అలాగే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజు ల్లోనూ భక్తులు వస్తున్నప్పటికీ శాశ్వత సౌకర్యాలు కల్పిం చడంపై మంత్రులు, అధికారులు దృష్టి సారించడం లేదు. తాత్కాలిక పనులతోనే ఎక్కువగా ‘మిగులు’ ఉంటుందని భావించిన అధికారులు ఇప్పుడు కూడా అలాగే చేపడుతున్నా రనే విమర్శలు వినిపిస్తున్నాయి.   –సాక్షి ప్రతినిధి, వరంగల్‌



సాక్షి ప్రతినిధి, వరంగల్‌ :

తమిళ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హిట్‌ సినిమాలో ‘అరుణాచలం’ ఒకటిగా పేరు సంపాదించింది. అందులో 30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు చేయాలనే చాలెంజ్‌ను రజనీ స్వీకరిస్తాడు. రోజుకు రూ. కోటి ఎలా ఖర్చు చేయాలో తెలియక ప్రతి వస్తువునూ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తుంటాడు. బాగానే ఉన్న ఇల్లు కూలగొట్టి మళ్లీ కట్టిస్తాడు. హోటల్‌ మొత్తాన్ని అద్దెకు తీసుకుంటాడు. నటన తెలియని మామను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. మొత్తంగా 30 రోజుల్లో రూ.30 కోట్ల డబ్బు వృథాగా ఖర్చు చేస్తాడు. ప్రస్తుతం మేడారం జాతరకు కేటాయించే నిధులు, చేపట్టే పనులు సైతం అచ్చం అరుణాచలం సినిమానే తలపిస్తున్నాయి.



ఏడాది ముందుగానే జాతర జపం మొదలు.. అభివృద్ధి పనులకు రూ. వందల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు.. రెండు నెలలకోసారి సమీక్షలు.. ఇంత చేసి ముందుగానే పనులు ప్రారంభిస్తారని అనుకుంటే అది మన పొరపాటేనని గ్రహించాలి. జాతర సమయం దగ్గర పడిన తర్వాతనే అధికారులు పనులు మొదలుపెడుతున్నారు. గడువు సమీపిస్తోందని చివరకు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. జాతర పూర్తికాగానే రూ. వంద కోట్లతో చేపట్టిన పనులు, అందుకు సంబంధించిన ఫలితాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా ఏర్పడినా అధికారులు తమ పనితీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



టెండర్లు దాటని పనులు

ఈసారి 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జాతర నిర్వహిస్తామంటూ సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్‌లో ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 35 రోజుల ముందుగా అంటే 2017 డిసెంబర్‌ 31 వరకు జాతర పనులు పూర్తి కావాలి. ఇప్పటినుంచి లెక్కించినా ప్రభుత్వం కేటాయించిన రూ.104 కోట్ల వ్యయంతో చేపట్టే పనులు సుమారు 104 రోజుల్లో పూర్తి చేయాలి. జాతర తేదీలు ప్రకటించి ఐదున్నర నెలలు దాటినా.. ఇంతవరకు ఒక్క పని ప్రతిపాదనల దశ దాటుకుని ముందుకు సాగలేదు. జాతర పనుల్లో జంప్నవాగుపై చెక్‌డ్యామ్‌లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, పదివేల మరుగుదొడ్లు, మేడారానికి వచ్చే మార్గంలో వంతెనలు, కల్వర్టులు, రోడ్డు మరమ్మతులు వంటి పనులు ఉన్నాయి. ఈ పనుల అంచనాలు ఖరారు చేసి, టెండర్లు నిర్వహించి, అగ్రిమెంటు పూర్తి చేసి, మెటీరియల్‌ తెప్పించి పనులు మొదలుపెట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. పనులు మొదలు కాగానే.. డిసెంబర్‌ మొదటివారం నుంచే భక్తుల రాక మొదలవుతుంది.



ఈ లోపు సంక్రాంతి సెలవులు వస్తాయి. దీంతో భక్తుల రాక పెరుగుతుంది. రోజుకు వేల సంఖ్యలో వచ్చిపోతుంటారు. ఈ జాతర జపంలో ఎప్పటిలాగే  నాణ్యతను పక్కకు తప్పించి హడావుడిగా పనులు చేపట్టి వందల కోట్ల రూపాయలు మమ అనిపిస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగానే గత జాతరలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్, డార్మిటరీ, టాయిలెట్లు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించాల్సి ఉండగా.. ఒక్కదానికే శంకుస్థాపన జరిగింది. ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.



చిన్న జిల్లాలోనూ మారని తీరు

పరిపాలనలో వేగం పెరిగి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో రాష్ట్రంలోని పది జిల్లాలను విభజించి 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పరి«ధిలోకి వెళ్లింది. చిన్న జిల్లాలుగా మారినప్పటికీ.. జాతర ఏర్పాట్లలో అలసత్వం కొనసాగుతోంది. గత జాతర ఏర్పాట్ల తరహాలోనే ఈ సారి నిరంతర జాప్యం చోటుచేసుకుంటోంది.



స్టడీ టూర్‌కు వెళ్లొచ్చినా..

తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క–సారలమ్మ జాతర జరుగుతుంది. మాఘశుద్ధపౌర్ణమి (దాదాపు ఫిబ్రవరి) సమయంలో ఈ జాతర నిర్వహిస్తారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరుణంలో జాతర పనులు ఏడాది ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. 2016 డిసెంబరులో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లలో అధునాతన పద్ధతులు తెలుసుకునేందుకు స్టడీ టూర్‌లో భాగంగా జిల్లా అధికారులు 2017 జనవరిలో శబరిమలైకు వెళ్లారు. ఆఖరికి 2017 ఫిబ్రవరిలో రూ.147 కోట్లతో జాతర ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 104 కోట్ల ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. ఆ తర్వాత 2017 జూన్‌ 8న సచివాలయం, హైదరాబాద్‌లో రాష్ట్ర గిరిజన శాఖమంత్రి ఆజ్మీరా చందూలాల్‌ సమీక్షించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జాతరకు సంబం«ధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top