నేడు మెదక్ జిల్లా బంద్

నేడు మెదక్ జిల్లా బంద్ - Sakshi


- పిలుపునిచ్చిన కాంగ్రెస్  

 సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై ప్రభుత్వ దౌర్జన్యకాండకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నెల 26న బాధిత రైతులను పరామర్శించేందుకు పార్టీ ముఖ్య నాయకులందరూ తరలి వెళ్లాలని నిర్ణయించింది. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అండగా ఉంటామని నేతలు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గాంధీభవన్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో టీపీసీసీ అత్యవసర భేటీ జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి, అంజన్‌కుమార్ యాదవ్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కుసుమ కుమార్, ఈరవర్తి అనిల్, క్యామ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసుల లాఠీచార్జి, జిల్లా కాంగ్రెస్ నేతల అరెస్టు తదితర అంశాలపై చర్చించారు. స్థాని కంగా చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసి ఆరా తీశారు. అనంతరం సమావేశ వివరాలను భట్టి విక్రమార్క, జానారెడ్డిలు వివరించారు. రాష్ట్రంలో దుర్మార్గ, నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సాంకేతికంగా సాధ్యం కాని మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దౌర్జన్యంగా పేద రైతుల నుంచి భూములు గుంజుకుంటోందని మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై దాడు లు చేస్తోందన్నారు. రైతులను వందలాది మం ది పోలీసులు చుట్టుముట్టి పశువులను బాధినట్లు కొట్టారన్నారు. దేశంలో ఎక్కడా ఇంత ఘోరమైన పరిస్థితులు ఎదురుకాలేదన్నారు.

 

 క్రూరమైన చర్య: ఉత్తమ్

 మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా బంద్‌కు అందరు సహకరించాలని కోరారు.

 

 కాంగ్రెస్ నేతల పాదయాత్ర..

 లాఠీచార్జిలో గాయపడిన బాధిత మహిళలను కాంగ్రెస్ నేతలు పరామర్శించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, నేతలు దాసోజు శ్రావన్ కుమార్, జగ్గారెడ్డి తదితరులు గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎరవ్రల్లికి వెళ్లేందుకు యత్నించారు. తూప్రాన్  డీఎస్పీ వెంకటేశ్వర్లు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నేతలు గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రాజీవ్ రహదారిపైకి మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారిపై బైఠాయించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top