గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నం

గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నం


శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదును అందజేసేందుకు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన వాసుపల్లి సునీత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 2013 సంవత్సరంలో రూ.లక్షా 50వేలు అప్పు తీసుకుంది. నూటికి రూ.10 చొప్పున నెలకు రూ.15 వేలు చొప్పున వడ్డీ చెల్లించేది. గతేడాది సెప్టెంబర్‌ వరకు వడ్డీ చెల్లించింది. ఆమెకు ఆరోగ్యం బాగులేకపోవడంతో మూడు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు.  దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి బెదిరిం చాడు. ఇంటి డాక్యుమెంట్లు ఇటీవల తీసుకుపోయాడు. ఈ విషయంపై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 5న ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది.



సివిల్‌ కేసని, కోర్టును ఆశ్రయించాలని పోలీసు అధికారులు తెలపడంతో ఎస్పీ ఆఫీసు ముందు నిద్రమాత్రలు, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె భర్త శ్రీను తెలిపారు. ఆమెకు శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఓఎస్‌డీ కె.తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన వినతుల్లో నాలుగు పరిష్కరించగా, మిగిలినవి వాయిదా వేశారు. కార్యక్రమంలో మహిళా పీసీ డీఎస్పీ వి.సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఎస్‌ఐ పి. రాజేశ్వరరావు, న్యాయవాది టి.వరప్రసాదరావు, జ్యోతి, సిటిజన్‌ ఫొరం ప్రతినిధి బరాటం కామేశ్వరరావులు పాల్గొన్నారు.



గ్రీవెన్స్‌సెల్‌కు తగ్గిన వినతులు  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు, ఫిర్యాదులు తగ్గాయి. గతవారం గ్రీవెన్సుసెల్‌ను రద్దు చేయడంతో ఈ వారం కూడా గ్రీవెన్స్‌సెల్‌ ఉండదని ఫిర్యాదుదారులు హాజరుకాలేదు. వినతులు, ఫిర్యాదులను జేసీ–2 పి.రజనీకాంతారావు స్వీకరించారు. వినతుల్లో కొన్ని..



ఏ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ జేసీ–2కు విన్నవించారు. హెల్త్‌సెంటర్లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చిన భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని చేపలు చెరువులు తవ్వారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన అలుపాన శంకర్, ఆయన భార్య సూరమ్మ తదితరులు జేసీకి గోడు వినిపించారు. తమ భూములను తమకు అప్పగించాలంటూ తమ వద్ద ఉన్న పట్టాలను చూపించారు. ఏ ఇల్లు నిర్మించి అప్పగించాలంటూ మెళియాపుట్టిలోని కుమ్మర వీధికి చెందిన కళావతి పట్నాయక్‌ విన్నవించింది. అలాగే, భామిని మండలంలోని  సింగిడి గ్రామ ఎస్సీ కాలనీ వంశధార బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సమీపంలో ఉందని, దీనిని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలంటూ ఆ కాలనీకి చెందిన ఎస్సీ కుటుంబాలు జేసీ–2కు విజ్ఞప్తి చేశాయి. 78 కుంటుంబాలను ఆదుకోవాలంటూ సీపీఎం సీనియర్‌ నేత చౌదరి తేజేశ్వరరావు, పి.జయకృష్ణ, కాంతారావు, కృష్ణారావు, ఎస్‌.ఝాన్సీరాణిలు కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top