పెళ్లిలుంటే వీడికి పండుగే

పెళ్లిలుంటే వీడికి పండుగే

కర్నూలు: పెళ్లిళ్లు జరుగుతున్న కల్యాణ మండపాల సమాచారాన్ని ముందుగానే సేకరించుకుని బంధువుల తరహాలో కల్యాణ మండపానికి చేరుకుంటాడు. వధూవరుల గదిని గుర్తించి ఎవరి పనిలో వారు నిమగ్నమైవున్న సమయంలో గదిలోనికి ప్రవేశించి బ్యాగులలో భద్రపరచిన నగలు, నగదును మూటకట్టుకుని ఉడాయిస్తాడు. ఇలా 11 కేసుల్లో నిందితుడైన మాదవరపు సచ్చినాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.40 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన బైక్‌ను రికవరీ చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు.

 

సేవాస్తంభ్‌ జిల్లా నాయకుడు దివంగత నల్లారెడ్డి కుమారుడైన మాదవరపు సచ్చినాథ్‌ 2005లో పుల్లారెడ్డి కాలేజ్‌లో బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొంతకాలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్‌ దగ్గర కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. అబ్దుల్లా ఖాన్‌ ఎస్టేట్‌లోని సెల్‌ వరల్డ్‌లో సేల్స్‌మెన్‌గా 2008 నుంచి ఏడాది పాటు  పనిచేశాడు. 2009 ఫిబ్రవరిలో కర్నూలు శివారులోని ఎన్‌టీఆర్‌ బిల్డింగ్స్‌కు చెందిన పెద్దరంగయ్య కుమార్తె సరళను వివాహం చేసుకున్నాడు. ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. 2010లో సెల్‌ఫోన్‌ దొంగతనానికి పాల్పడ్డాడు. అప్పట్లో తండ్రికి ఉన్న మంచిపేరుతో పోలీసులు మందలించి వదిలేశారు. 2011లో తండ్రి పనిచేయు ఏపీజీఎల్‌ఐసీ ఆఫీసులో క్లర్కు కింద అసిస్టెంట్‌గా చేరాడు. 2014లో నల్లారెడ్డి మృతిచెందాడు. ఆ తర్వాత మళ్లీ నేరాలబాట పట్టాడు. 2016 నవంబర్‌ మాసంలో రామలింగేశ్వరనగర్‌లో దొంగతనం చేస్తుండగా, స్థానికులు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా మిద్దెపై నుంచి దూకి తప్పించుకున్నాడు. గాలింపు చర్యలు చేపట్టి నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి బెయిల్‌పై వచ్చినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. ఆర్థిక సమస్యలతో మళ్లీ నేరాల బాట పట్టాడు.

 

ఇలా దొరికాడు... 

పాతబస్తీలోని పూలబజార్‌లో ఉన్న చిన్నమ్మ వారి శాలలో ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. వేదిక వెనుకవైపు కుడి పక్కన ఉన్న రూమ్‌లోకి ప్రవేశించి లగేజీ బ్యాగులో ఉన్న 21 తులాల బంగారు ఆభరణాలను అపహరించి బైక్‌పై పారిపోయాడు. వాహనం నంబరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉండటంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా ముందు వాహనాన్ని గుర్తించి, తర్వాత దొంగను పట్టుకున్నారు. సమీపంలోని నెట్‌ సెంటర్‌లో కూడా సీసీ కెమెరాలో మోటర్‌బైక్‌ నంబరు నమోదైనట్లు పోలీసులు గుర్తించి స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించారు.  

  

నేరాల చిట్టా ఇది..

చిన్నమ్మ వారి శాల, ఇంటర్నేషనల్‌ ఫంక‌్షన్‌ హాల్, ఎస్‌ఏపీ క్యాంపులోని టీజీవీ కల్యాణ మండపం, కేవీఆర్‌ గార్డెన్స్, దేవీ ఫంక‌్షన్‌ హాల్, టీటీడీ కల్యాణ మండపం, బి.క్యాంప్‌లోని టీజీవి కల్యాణ మండపంలో సచ్చినాథ్‌ చోరీలకు పాల్పడ్డాడు. మొత్తం 11 కేసులలో ఇతను నిందితుడు. దొంగిలించిన వస్తువులను కర్నూలు షరాఫ్‌ బజార్‌లో గతంలో 29వ నంబర్‌ గల షాపును నడుపుతున్న కదమ్‌ గోపాలరావు అలియాస్‌ గోపి ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ వ్యాపారీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్వల్పకాలంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో 11 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేయడమే కాక పెద్ద మొత్తంలో బంగారు నగలు, నగదును రికవరీ చేసినందుకు సీఐలు బి.ఆర్‌.కృష్ణయ్య, నాగరాజరావు, నాగరాజు యాదవ్, శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్‌ఐ భాస్కర్, హెడ్‌ కానిస్టేబుళ్లు సూర్యనారాయణరెడ్డి, హుసేన్, కానిస్టేబుళ్లు, మురళి, మహమ్మద్‌ బాషా, మాసూం, మల్లి, రఘు, హోంగార్డు డ్రైవర్‌ రఘు తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top