మందుపాతర పేల్చిన మావోయిస్టులు


-గడ్చిరోలి బూటకపు ఎన్‌కౌంటర్ బూటకమని వెల్లడి

-ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ బంద్ పాటించాలని వాల్‌పోస్టర్లు



చర్ల


ఖమ్మం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ సమీపంలో మావోయిస్టులు శనివారం రాత్రి మందు పాతర పేల్చారు. ఈ నెల 22న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహిరీ పోలీస్‌స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ (చర్ల-ఉంజుపల్లి మార్గం) వద్ద రహదారి పక్కన పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు వేయడంతోపాటు మందుపాతరను పేల్చారు.



గతంలో పలు సందర్భాల్లో మావోయిస్టులు బంద్ పిలుపునివ్వగా పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి బంద్‌ను విజయవంతం చేసేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు.  ప్రధాన రహదారి (బీటీ రోడ్) పక్కనే మందు పాతరను ఏర్పాటు చేసిన మావోయిస్టులు సుమారు 50 మీటర్ల దూరం వరకు విద్యుత్ వైరును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దీనిని పేల్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పేరిట పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు సైతం అంటించారు.



మావోయిస్టు పార్టీ గడ్జిరోలి జిల్లా కమిటీ సభ్యుడు చార్లెస్ అలియాస్ శోభన్, ఏరియా కమిటీ సభ్యుడు ముకేష్‌తోపాటు మరో పీఎల్‌జీఏ సభ్యుడిని ఇన్‌ఫార్మర్ల సమాచారంతో పట్టుకొని కాల్చి చంపి ఎన్‌కౌంటర్ కథ అల్లారని, దీనిని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు తీవ్రంగా ఖండించాలని కోరారు. కాగా, చర్ల పోలీస్‌స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top