రోగమొకటైతే.. మందొకటిచ్చాడు!

రోగమొకటైతే.. మందొకటిచ్చాడు!


- కడుపునొప్పి ఉందని వెళ్తే లివర్ పక్కన ఆపరేషన్‌

- కర్నూలు ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండుప్రాణం బలి




మానవపాడు (మహబూబ్‌నగర్) : రోగం ఒకటైతే మందు మరొకటి అనే చందంగా ఉంది వైద్యుల తీరు. కడుపునొప్పి ఉందని వెళ్తే లివర్ పక్కన ఆపరేషన్ చేసి చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీశారు. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం అమరవాయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. అమరవాయికి చెందిన గురుస్వామి, సత్యమ్మల చిన్నకొడుకు రాజు(20)కు గతనెల 23వ తేదీన కడుపునొప్పి తీవ్రంగా రావడంతో గ్రామంలో ఉన్న ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని రక్ష ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశాడు. వారు వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రాణాలుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజును ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబసభ్యులు సరేనన్నారు. ఆపరేషన్ చేసిన వైద్యుడు కోటిరెడ్డి నాలుగురోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పి వారం రోజుల వరకు అక్కడికి రాలేదు. కనీసం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రాజు కుటుంబ సభ్యులు కలత చెందారు.



రాజు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోతుండడంతో తండ్రి గురుస్వామి ఇది తట్టుకోలేక మరో ఆస్పత్రికి తీసుకెళ్లి తన కొడుకును ఎలాగైనా బతికించాలని కాళ్లావేళ్లపడ్డారు. అక్కడ వైద్యసిబ్బంది మాత్రం రెండురోజుల్లో నయమవుతుందని చెప్పి తిరిగి పంపించారు. చివరకు బుధవారం ఉదయం ఆపరేషన్ చేసిన వైద్యుడు కోటిరెడ్డి రక్ష ఆస్పత్రికి వచ్చి రాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వారి వెంట వెళ్లిన వైద్యుడు కోటిరెడ్డి రాజు ఆపరేషన్ కోసం రూ.లక్ష చెల్లించాడు. ఇదిలాఉండగా, పరీక్షించిన యశోదా ఆస్పత్రి వైద్యులు లివర్ పక్కన అవసరం లేని ఆపరేషన్ చేశారని గుర్తించినట్లు రాజు తల్లిదండ్రులు వివరించారు.



అయితే రాజు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కనుమూశాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని కర్నూలు రక్ష ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ కొడుకు చావుకు మీరే బాధ్యులని, కడుపునొప్పి అని వస్తే లేనిపోని ఆపరేషన్లు చేసి చంపేశారని గొడవకు దిగారు. తనకు ఎలాంటి సంబంధంలేదని వైద్యుడు కోటిరెడ్డి చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి తప్పుచేయనని.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని వైద్యులు భరోసా ఇవ్వడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడు రాజు తండ్రి గురుస్వామి చేతికొచ్చిన కొడుకును ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు బలిచేశారని కన్నీరుమున్నీరయ్యాడు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top