జాతరకొచ్చి కానరాని లోకాలకు..

జాతరకొచ్చి కానరాని లోకాలకు..


ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు

యువకుడు దుర్మరణం

మరో ముగ్గురికి గాయాలు




మరికొన్ని గంటల్లో గంజుకుంటమ్మ (మారెమ్మ) జాతర సÜంబరంగా జరుపుకోవాల్సి ఉంది. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. ఇంతలో పిడుగులాంటి వార్త. రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబ సభ్యుడు ఒకరు దుర్మరణం చెందారు. జాతరకొచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ మృతుడి తల్లిదండ్రులు, సోదరీమణులు విలపించారు.



కళ్యాణదుర్గం: ఎర్రంపల్లి గేటు వద్ద బుధవారం వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కుర్లపల్లికి చెందిన బొజ్జన్న (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో కుర్లపల్లికి చెందిన శిల్ప, కామక్కపల్లికి చెందిన నరసింహులు, కంబదూరుకు చెందిన నారాయణస్వామిలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కుర్లపల్లికి చెందిన అగులూరప్ప, రామలక్ష్మమ్మ దంపతులకు కుమారుడు బొజ్జన్నతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బొజ్జన్న ఎనిమిదేళ్లుగా బెంగళూరులో తన చిన్నాన్న గోవిందు వద్ద ప్లెక్సీల ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. మారెమ్మ జాతర కోసం మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. పండుగ పనులలో భాగంగా బుధవారం తనబంధువు అయిన హనుమంతప్ప కూతురు శిల్పతో కలిసి ద్విచక్రవాహనం (స్పోర్ట్స్‌ బైక్‌)లో స్వగ్రామం నుంచి కళ్యాణదుర్గానికి బయల్దేరాడు.



కంబదూరుకు చెందిన నారాయణస్వామి తన మిత్రుడైన కామక్కపల్లికి చెందిన నరసింహులును ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని కళ్యాణదుర్గం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. కళ్యాణదుర్గం – కంబదూరు ప్రధాన రహదారిలో ఎర్రంపల్లి గేటు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొజ్జన్న అక్కడికక్కడే మృతి చెందాడు. శిల్ప తలకు బలమైన గాయమైంది. నారాయణస్వామి తలకు తీవ్ర రక్తగాయాలవగా.. నరసింహులుకు ఎడమకాలు విరిగిపోయింది. ముగ్గురినీ కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. కాగా నారాయణస్వామి, శిల్పల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. టౌన్‌ ఎస్‌ఐ శంకర్‌రెడ్డి కేసు దర్యాప్తుచేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top