పెళ్లి కాకుండా తల్లయిందనే!


పొదల్లో దొరికిన పసివాడి తల్లిని గుర్తించిన 

    పోలీసులు

 మక్కువ : ఇటీవల పొదల్లో పసివాడిని వదిలేసి వెళ్లిపోయిన తల్లిని మక్కువ పోలీసులు గుర్తించారు. ఆ సంఘటన జరిగిన వెంటనే ముందుగా అంగన్‌వాడీ సిబ్బందిని ఆరా తీయాలని పోలీసులు కోరారు. అయితే ఎవరన్న విషయం బయటకు రాకపోవడంతో ఎస్సై వెలమల ప్రసాద్ రంగప్రవేశం చేసి 48 గంటల వ్యవధిలోనే పసివాడి తల్లిని గుర్తించారు. ఈ మేరకు వివరాలను మంగళవారం విలేకరులకు ఆయన వివరించారు. మండలంలోని పనసభద్ర గ్రామానికి చెందిన యువతి తూర్పుగోదావరి జిల్లాలో పనికి వెళ్లింది. అక్కడ ఓ యువకుడు చేసిన మోసానికి బలై గర్భం దాల్చింది. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి చేరుకుంది. ఆమె శరీరంలో మార్పులు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. అయితే, కడుపులో కాయ ఉందంటూ ఆమె తప్పించుకుంది. 

 

 తీరా నెలలు నిండడంతో ఈ నెల 24వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో బాబుకు జన్మనిచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా 25వ తేదీ తెల్లవా రు జామున 4 గంటల సమయంలో పసికందును తెలగడవలస గ్రామ సమీపంలోని ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. అనంతరం యువతికి కడుపులో నొప్పిగా ఉందంటూ ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయించారు. దీంతో ఆర్‌ఎంపీలు యువతికి పెయిన్ కిల్లర్ మాత్రలు అందించారు. విచారణలో ఈ విషయాలు వెల్లడి కావడంతో సదరు ఆర్‌ఎంపీ వైద్యులను ఎస్సై ప్రసాద్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. కడుపులో నొప్పిగా ఉందంటే అందుకు అవసరమైన మందులు ఇచ్చామని వారు తెలిపారు. యువకుడు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆచారంగా వస్తున్న ప్రకారం.. భర్త లేకుండా యువతి గర్భం దాల్చితే కులానికి కట్టుబడి తప్పు(జరిమానా) కట్టవల్సి వస్తుంది. దీంతో పరువు పోతుందని భావించిన ఆ యువతి.. పలువురి సహాయంతో పసివాడిని పొదల్లో వదిలేసినట్లు తెలుస్తోంది. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top