ఫోన్ గెలిచారంటూ మోసం

ఫోన్ గెలిచారంటూ మోసం - Sakshi


నారాయణపేట : హలో.. మేము సామ్‌సంగ్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. వంద ఫోన్‌నంబర్లలో మీ ఫోన్‌ నంబర్‌కు సామ్‌సంగ్‌ జే–7 లక్కి ప్రైజ్‌ వచ్చింది.. పోస్టాఫీస్‌కు వెళ్లి తీసుకోండంటూ సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ అమాయకుడు మోసపోయాడు. ఈ విషయం సోమవారం వెలుగుచూసింది.



వివరాల్లోకి వెళ్తే.. మరికల్‌ మండలం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన నర్సింహులు అనే యువకుడికి పది రోజుల క్రితం 8750557241 నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. వంద నంబర్లలో మీ నంబర్‌కు సామ్‌సంగ్‌ జే–7 ఫోన్‌ ప్రైజ్‌ లక్కీ ఆఫర్‌ వచ్చింది.. అడ్రస్‌ చెబితే పంపిస్తామంటూ నమ్మించి పూర్తి వివరాలను తీసుకున్నారు. సోమవారం మరోసారి కాల్‌చేసి మీరు చెప్పిన అడ్రస్‌ ప్రకారం పోస్టాఫీస్‌కు పార్సిల్‌ వచ్చింది తీసుకెళ్లాలని కోరారు.



నర్సింహులు వారి మాయలో పడి పోస్టాఫీసులో రూ.4వేలు చెల్లించి పార్సిల్‌ తీసుకుని ఇప్పి చూశాడు. బాక్స్‌లో ఫోన్‌ లేదు. సబ్బుపెట్టెలు, ఓ బెల్టులు బయటపడటంతో అవాక్కయ్యాడు. వెంటనే కంపెనీ నుంచి వచ్చిన నంబర్‌కు కాల్‌చేశాడు. ‘తాము చేసేది ఇదే వ్యాపారం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ.. ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. జరిగిన మోసంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలాఉండగా సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన సంఘటన ఇది మండలంలో రెండోది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top