ఉద్యమాన్ని అణచినవారికి అందలమా?


ఎర్రుపాలెం : తెలంగాణ కోసం ఉద్యమించిన వారికి మొండి చెయ్యి చూపి ఉద్యమాలను అణగదొక్కిన వారికి సీఎం కేసీఆర్‌ మంత్రి పదవులను కట్టబెట్టడం సమంజసమా? అని వైఎస్సార్‌సీపీ ఖమ్మం జిల్లాS అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు ప్రశ్నించారు. తెల్లపాలెం గ్రామంలో ఆదివారం పార్టీ స్థానిక నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ శీలం హరీందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలుత మండలంలోని మీనవోలు గ్రామంలోని మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఖమ్మంలో కేసీఆర్‌ నిరాహార దీక్ష చేసినప్పుడు, ఆయన్ను జైల్లో వేయించడంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాత్ర చాలా ఉందని ఆరోపించారు. అలాంటి వ్యక్తి 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటీకీ కేసీఆర్‌ మంత్రి పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు. టీడీపీలో 9 ఏళ్లు మంత్రిగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు, దివంగత వైఎస్సార్‌ బొమ్మ పెట్టుకుని ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార దాహంతోనే సొంత పార్టీలను వీడారని మండిపడ్డారు.



తెలంగాణ కోసం కష్టపడిన బుడాన్‌ బేగ్‌ లాంటి కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌లో మంచి స్థానం కల్పించలేక పోయారన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్‌తో ఏమాత్రం పొసగదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌ బొమ్మతో పదవులు అనుభవిస్తున్న వారందరూ తిరిగి పార్టీలో చేరడం మంచిందని సుధీర్‌బాబు అభిప్రాయపడ్డారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని, జర్నలిస్టులకు స్థలాలిచ్చి, పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం పెద్ద చెరువుకు సాగర్‌ జలాలను ఈ ఏడాది విడుదల చేయకపోవడంతో 2,500 ఎకరాల్లోని వరి సాగు చేయని పరిస్థితి నెలకొందన్నారు. జమలాపురం పెద్ద చెరువుకు వెంటనే సాగర్‌ జలాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లేపల్లి సైదులు, మండల కమిటీ అధ్యక్షుడు వేమిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా నాయకులు సంపటి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి రోశిరెడ్డి, నాయకులు దేవరకొండ భూషణం, ముక్కర వెంకట్రామిరెడ్డి, యన్నం పిచ్చిరెడ్డి, ఆకుల సాంబశివరావు, షేక్‌ ఇస్మాయిల్, ముక్కర సంజీవరెడ్డి, ఇనపనూరి భాస్కర్, కుడుముల సత్యనారయణరెడ్డి, చింతిరాల వెంకటేశ్వరరావు, ఇనపనూరి వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top