హామీ నిలబెట్టుకోండి..

హామీ నిలబెట్టుకోండి.. - Sakshi


♦ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయండి

♦ కేంద్రానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి

♦ రైల్వేమంత్రిని కలసి వినతిపత్రం అందజేసిన పార్టీ ప్రతినిధి బృందం

 

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలసి వినతిపత్రం సమర్పించింది. బృందంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు తదితరులున్నారు. భేటీ అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు.



చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆరు మాసాల్లోనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాల్సి ఉందని, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు తదితర డివిజన్లను ఇందులో కలపాల్సి ఉందని చెప్పారు. అయితే కేంద్రం ఇప్పటివరకు దీనిని ఆచరణలోకి తేలేదన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన రైల్వేజోన్ ప్రకటించాలని మంత్రిని కలసి కోరామని, సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వట్లేద ని, నిధులివ్వట్లేదని, అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారేగానీ ఢిల్లీ వచ్చి మాట్లాడిన పాపాన పోవట్లేదని ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. విభజన హామీలపై కేంద్రం మౌనం దాల్చడం బాధాకరమని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top