తొలుత జలాశయాలు నింపండి

తొలుత జలాశయాలు నింపండి


పెద్దవరం (కురిచేడు) : సాగర్‌ బ్రాంచి కాలువల మేజర్‌ షట్టర్లు మూసేసి తొలుత రామతీర్థం జలాశయానికి నీరు తరలించాలని కలెక్టర్‌ సుజాతశర్మ ఎన్‌ఎస్పీ అధికారులను ఆదేశించారు. దర్శి, పమిడిపాడు బ్రాంచి కాలువల నీటి సరఫరా తీరును ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. పీబీసీ షట్టర్లు దించేందుకు ప్రయత్నించిన దర్శి ఎన్‌ఎస్‌పీ ఏఈ నిశాంత్‌పై గుంటూరు జిల్లా రైతులు ఆదివారం దాడికి పాల్పడిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి వరకు రైతులు పీబీసీ షట్టర్లు దించకుండా అధికారులను అడ్డుకున్నారు. దర్శి సీఐ రాఘవేంద్ర, కురిచేడు ఎస్‌ఐ కిశోర్‌బాబులతో పాటు ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ శారదలు తమ సిబ్బందితో అర్ధరాత్రి వరకు అక్కడే వేచి ఉండి పరిస్థితులు గమనించారు. ఆదివారం జరిగిన సంఘటనపై కలెక్టర్‌కు అధికారులు వివరించారు.



మరో మూడు రోజుల్లో సాగర్‌ నీటి సరఫరా నిలిపివేయనున్న దృష్ట్యా రామతీర్థం, ఒంగోలు జలాశయాలకు నీరు తరలించాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ ఎన్‌ఎస్‌పీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రామతీర్థానికి టీఎంసీ నీరు చేరాల్సి ఉండగా ఇంత వరకూ అడుగు కూడా తడవలేదన్నారు. పీబీసీ పరిధిలోని రైతులు మరో 24 గంటల పాటు నీటిని సరఫరా చేయా లని కోరగా సమ్మతించిన కలెక్టర్‌.. మంగళవారం ఉదయం 10 గంంటలకు పీబీసీకి నీటి సరఫరా నిలిపేయాలని ఆదేశించారు. రజానగరం మేజర్‌కు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంట ల వరకు 150 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం ఎలాంటి అవాంతరాలకు తావివ్వకుండా పోలీసుల బందోబస్తుతో రామతీర్థం, ఒంగోలు జలాశయాలకు నీటిని తరలించాలని కలెక్టర్‌ సుజాతశర్మ ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు.



దాడుల మ«ధ్య విధులు నిర్వర్తించలేం..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తిస్తున్నా తమపై రైతు నేతలు అకారణంగా దాడులు చేస్తున్నారని, ఈ పరిస్థితులలో  తాము విధులు నిర్వర్తించలేమని ఎన్‌ఎస్పీ అధికారులు, సిబ్బంది  కలెక్టర్‌ సుజాత శర్మ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నేతలపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆమె కురిచేడు ఎస్‌ఐ కిశోర్‌బాబును ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పిడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top