గురుకులంలో కన్వీనర్‌ కలకలం!

గురుకులంలో కన్వీనర్‌ కలకలం!


బీసీ గురుకుల కన్వీనర్‌కు, జిల్లా సంక్షేమ అధికారికి మధ్య కోల్డ్‌వార్‌

కన్వీనర్‌ను తప్పించేందుకు అధికారుల విశ్వప్రయత్నాలు

అక్రమాలకు కలిసొస్తున్న ఒకేచోట రెండు గురుకులాలు

ఒకే గురుకులం పేరు మీదనే రెండు గురుకులాలకు కిరాణం, కూరగాయల సరఫరా

సెక్యూరిటీ, స్వీపింగ్‌ శానిటేషన్‌ సిబ్బంది నియామకాల్లో అక్రమ వసూళ్లు

రూ.50 వేలకు కన్వీనర్‌ పోస్టు బేరం పెట్టారని వినికిడి


నల్లగొండ : మహాత్మా జ్యోతిభాపూలే వెనకబడిన తరగతుల గురుకులంలో కలకలం..! గురుకులాలు ప్రారంభించి రెండు నెలలు కూడా గడవ ముందే అప్పుడే అధికారుల మధ్య విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ‘కన్వీనర్‌’ పోస్టు విషయంలో అంతర్గతంగా సాగుతున్న ఫైట్‌ కాస్తా రచ్చకెక్కింది. గురుకులాలపై ఆధిపత్యాన్ని చేజిక్కించుకునేందుకు ఒక మహిళా అధికారిణి పావులా వాడుకున్నారని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. గురుకులాల్లో  తెరవెనక సాగుతున్న అక్రమాలు ఎక్కడ వెలు గులోకి వస్తాయోనన్న ఆం దోళనతో చివరికి ‘కన్వీనర్‌’ పోస్టుకే ఎసరు పెట్టారు.



రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా బీసీ గురుకులాలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆరు నియోజకవర్గాలకు ఆరు గురుకులాలు జిల్లాకు మంజూరయ్యాయి. వీటిపై పట్టుసాధించేందుకు అధికారులు వేస్తున్న ఎత్తుగడలు అనేకం. గురుకుల పర్యవేక్షణ బాధ్యతలు తొలుత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణచారికి అప్పగించారు. కొంత కాలానికి గురుకులాలు, సంక్షేమ శాఖలు వేర్వేరు అని చెప్పి సంక్షేమ అధికారిని తప్పించి ఆ సీట్లో నాగార్జునసాగర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ బ్రహ్మచారిని కన్వీనర్‌గా నియమించారు. ఇది జరిగిన కొన్నాళ్లకే గురుకుల కన్వీనర్‌ పోస్టుకు సీనియర్‌ ప్రిన్సిపల్‌నే నియమించాలనే నిబంధన తెరపైకి తెచ్చారు. దీంతో మూసీ గురుకుల ప్రిన్సిపల్‌ శోభాదేవిని కన్వీనర్‌గా నియమించారు. నాలుగైదు మాసాలనుంచి కన్వీనర్ల మార్పు, చేర్పులకు సంబంధించిన వివాదం అంతర్గతంగా సాగుతోంది. మూసీ గురుకుల ప్రిన్సిపల్‌ను కన్వీనర్‌గా నియమించి కూడా రెండు మాసాలైంది. ప్రస్తుతం ఆమెనూ మార్చే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.



వ్యూహాత్మంగానే కన్వీనర్‌ మార్పు...!

ఇప్పుడున్న కన్వీనర్‌ను ఎందుకు మారుస్తున్నారనే కారణాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు.  జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి కనుసన్నల్లోనే కన్వీనర్‌ నడుచుకోవాలని బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ మల్లయ్య భట్టు ఆదేశించారు. ఆ ప్రకారంగానే ఇప్పుడున్న కన్వీనర్‌ వ్యవహారిస్తున్నారు. కానీ, కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు వర్గ పోరుకు దారితీశాయి. ముక్కుసూటి తత్వంతో నిక్కిచ్చిగా వ్యవహరించే కన్వీనర్‌ సంక్షేమ శాఖ అధికారి చెప్పినట్టు నడుచుకోకపోవడంతోనే ఆమె పోస్టుకు ఎసరు పెట్టినట్టు తెలిసింది. శోభాదేవిని తొలగించి ఆ స్థానంలో నాగార్జునసాగర్‌ గురుకుల కాలేజీ ప్రిన్సిపల్‌ భాస్కర్‌రెడ్డిని నియమిస్తున్నట్టు తెలిసింది. ఆయన కూడా ఈ ఏడాది చివరల్లో పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు కన్వీనర్‌ పోస్టుకు తిరిగి బ్రహ్మచారినే రప్పించేందుకు మార్గం సుగుమం అవుతుంది. కన్వీనర్‌ తొలగింపు వ్యవహారంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న జిల్లా అధికారుల్లో కొందరు డైరెక్టరేట్‌లో రూ.50 వేలు సమర్పించుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.



అక్రమాలు వెలుగుచూస్తాయనే...

విశ్వసనీయ సమాచారం మేరకు గురుకులాల్లో గుట్టుచప్పుడు కాకుండా అనేక అక్రమాలు జరుగుతున్నట్టు తెలిసింది. గురుకులాలు మంజూరు చేసిన ప్రాంతాల్లో అద్దె భవనాలు దొరకక నల్లగొండ, మిర్యాలగూడలోనే ఆరు గురుకులాలను సర్దుబాటు చేశారు. ఒక్కో భవనంలో రెండేసి గురుకులాలు నిర్వహిస్తున్నారు. ఈ గురుకులాలకు కిరాణం సామాన్లు సరఫరా చేసేందుకు ఆరు ఏజెన్సీలు ఎంపిక చేశారు. ఇలా రెండేసి గురుకులాలు ఒకో చోట నిర్వహించడం అధికారులకు భారీగానే కలిసిస్తోంది.



అదెలాగంటే కిరాణం సామాన్లు, కూరగాయాలు రెండు ఏజెన్సీల నుంచి కాకుండా ఒకే ఏజెన్సీ ద్వారా తెప్పించి లాభపడాలనేది అధికారుల ఎత్తుగడ. ఒకే ఏజెన్సీనుంచే కొనుగోలు చేసి బిల్లులు మాత్రం రెండు ఏజెన్సీల పేరు మీద క్లయిమ్‌ చేయాలని పక్కా ప్లాన్‌ వేశారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది నియామకాల్లో కూడా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు గురుకులాలకు ఒకరి సేవలనే వాడుకుని బిల్లులు మాత్రం రెండు గురుకులాల పేరు మీద క్లయిమ్‌ చేయాలనే ప్లాన్‌ వేశారు. జిల్లా అధికారుల ప్రోదల్బంతోనే ప్రిన్సిపల్స్‌తో ఈ తంతంగామంతా నడిపించాలని అనుకున్నారు. బయటికి వెలుగుచూడని ఇలాంటి అక్రమాలకు కన్వీనర్‌ అడ్డుగా ఉంటుం దన్న అక్కసుతో ఆమెను తొలగించేందుకు అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. నేడో, రే పో కన్వీనర్‌ మార్పుకు సంబంధించిన ఆదేశాలు కూడా రానున్నట్టు తెలిసింది.



నిజాయితీగా పనిచేశా

కన్వీనర్‌గా రెండు మాసాల నుంచి పనిచేస్తున్నా. ఇప్పటివరకు నిజాయితీగానే పనిచేశా. ఎలాంటి ఆరోపణలూ నాపై రాలేదు. కానీ కారణం చెప్పకుండానే నన్ను కన్వీనర్‌ పోస్టు నుంచి ఎందుకు తప్పిస్తున్నారో తెలియడం లేదు. గురుకులాల్లో ప్రిన్సిపల్స్‌ పైన ఫిర్యాదులు వచ్చాయి. నల్లగొండలోనే ఒక గురుకులం ప్రిన్సిపల్‌ అక్కడ పనిచేసే ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాడు. స్టోర్‌ రూం తాళాలు కూడా ఇవ్వకుండా తన వద్దనే పెట్టుకుని బెదిరిస్తున్నాడు. అక్కడ పనిచేసే ఉద్యోగులు కొత్త వారు కావడంతో డైరెక్టర్‌ కూడా ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. గురుకులాల కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేశా. జిల్లా సంక్షేమ అధికారి చెప్పినట్టు నడుచుకున్నా. అందరూ కలిసి నాపైనే కుట్ర పన్నారు.

– శోభాదేవీ, కన్వీనర్‌



గురుకులాల గురించి పట్టించుకోవడం మానేశా

గురుకులాలు గురించి పట్టించుకోవడం మానేశా. సంక్షేమంపరంగా నేను చూసుకోవాల్సిన పనులే చాలా ఉన్నాయి. ఆమెను మారుస్తున్నట్టు నాకు ఎలాంటి సమాచారమూ లేదు. నాకున్న సమాచారం మేరకు ఆమె కన్వీనర్‌గా ఉంది. సీనియర్‌ ప్రిన్సిపల్‌గా ఆమెకే కన్వీనర్‌ బాధ్యతలు అప్పగించారు. వాళ్లకు సంబంధించిన సమస్యల గురించి నేను పట్టించుకోవడం లేదు.  

– లక్ష్మణాచారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top