మూడునాళ్ల ముచ్చటే..!

మూడునాళ్ల ముచ్చటే..!

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : 

దుర్గగుడి అధికారుల అనాలోచిత  నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము వృథా అవుతోంది. అధికారుల  ఆదేశాలు మూడు నాళ్ల ముచ్చటగానే  మారుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే అన్నదానానికి ఉపయోగించే ప్లేట్స్‌ స్థానంలో కొత్తవి కొనుగోలు చేశారు. అయితే కొత్త ప్లేట్స్‌ కొనుగోలు చేసి  నెల రోజులు కాకుండా అవి మూలకు చేరాయి. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేట్స్‌ నిరుపయోగంగా మారినా ఆలయ అధికారులకు పట్టడం లేదు. అమ్మవారి ఆలయానికి  ఇచ్చిన విరాళాలను ఇలా దుర్వినియోగం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

అమ్మవారి అన్నప్రసాదాన్ని గుండ్రంగా ఉండే ప్లేట్స్‌లో భక్తులకు  వడ్డించే వారు. ఇందు కోసం దేవస్థానం వెయ్యి వరకు ప్లేట్స్‌ ఉపయోగించే వారు. గత నెల వరకు ఇన్‌చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ఆజాద్‌ ప్లేట్స్‌ను మార్చాలని నిర్ణయించారు. రోజుకు ఒక ప్లేట్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంటూ  5 వేల ప్లేట్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు  ఇచ్చారు.  ప్లేట్‌లో కూరలు కలిసిపోకుండా  ఉండే వాటిని కొనుగోలు చేయాలని అన్నదాన విభాగ అధికారులను  ఆదేశించారు. దీంతో సుమారు రూ. 9 లక్షల వ్యయంతో  రెండు వేల ప్లేట్లు, ట్రాలీలను కొనుగోలు చేశారు. గత నెల 26న  కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్‌లో అన్నదానాన్ని ప్రారంభించారు. అయితే  ఆలయ ఈవో మారినప్పుడల్లా వారు  చేసిన నిర్ణయాలు మారుతాయనేది దుర్గగుడిపై ప్రచారంలో ఉంది. అదే తరహాలో ఈవోగా సూర్యకుమారి వచ్చిన వెంటనే కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్‌ స్థానంలో గతంలో ఉపయోగించిన రౌండ్‌ ప్లేట్స్‌ ప్రత్యక్షమయ్యాయి. దీంతో రూ. 9 లక్షలతో కొనుగోలు ప్లేట్స్‌ నిరుపయోగంగా మారాయి. 



నీటి కొరత కూడా మరో కారణం 

కొండపై ఉన్న అమ్మవారి అన్నదానాన్ని అర్జున వీధిలోని శృంగేరీ పీఠానికి ఇటీవల మార్చారు.  అయితే అక్కడ నీటి కొరత కూడా ప్లేట్స్‌ మార్చేందుకు మరో కారణంగా ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్లేట్స్‌ శుభ్రం చేసేందుకు ఎక్కువగా నీటి వినియోగించాల్సి వస్తుందంటున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top