ట్రామాలో భారీ డ్రామా

ట్రామాలో భారీ డ్రామా


► కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి ప్రేమ

► కొత్తగా చేరిన ఉద్యోగులకు వేతనాలెక్కువ

► అదే క్యాడర్‌లోని పాతవారికి అన్యాయం




ట్రామాలో భారీ డ్రామా నడుస్తోంది.. కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వ సవతి ప్రేమ చూపుతోంది. íసీనియారిటీతో పని లేకుండా కొత్తగా చేరిన ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగా ఇస్తూ.. అదే క్యాడర్‌లో ఉన్న సీనియర్లకు అన్యాయం చేస్తోంది. ఇటీవల డీసీహెచ్‌ డాక్టర్‌ సుబ్బారావు విడుదల చేసిన నోటిఫికేషన్‌తో ఈ వ్యవహారం బయటపడింది.  



నెల్లూరు(అర్బన్‌): హైవేలపై ప్రమాదాలు జరిగినప్పుడు వారికి అత్యవసర సేవలు అందించేందుకు నెల్లూరులోని పెద్దాస్పత్రిలో  ఏడేళ్ల క్రితం ట్రామా కేర్, ఐసీయూ యూనిట్ల ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాలపరిమితి తీరాక రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాలని అప్పట్లో ఒప్పందం జరిగింది. అప్పట్లో ట్రామాలో 65 మంది ఉద్యోగులు చేరారు. వీరిలో నర్సింగ్‌ సిబ్బంది, టెక్నీషియన్లు, డ్రైవర్లు ఉన్నారు.



జీతం రూ.12,900 మాత్రమే: అప్పట్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన చేరిన స్టాఫ్‌ నర్సులకు వేతనం ఇప్పటికీ రూ.12,900 మాత్రమే ఇస్తున్నారు. గత నెలలో పెద్దాస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై స్టాఫ్‌ నర్సులుగా చేరిన 198 మందికి రూ.15,000 ఇస్తున్నారు. సర్వీసు ఉండి, ఒకే చోట పని చేస్తున్నప్పటికీ పాత వారికి వేతనాల్లో అన్యాయం చేస్తున్నారు.



డీసీహెచ్‌ నోటిఫికేషన్‌లోనూ అన్యాయమే: గత వారంలో పెద్దాస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, డిజిటల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌ తదితర 51 పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు డీసీహెచ్‌ డాక్టర్‌ సుబ్బారావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్‌ పరిశీలిస్తే ల్యాబ్‌ టెక్నీషియన్లకు, డిజిటల్‌ టెక్నీషియన్లకు నెలకు రూ.21,000 జీతంగా నిర్ణయించారు. అయితే ఏడేళ్లుగా ట్రామా కేర్‌ యూనిట్‌లో పనిచేస్తున్న టెక్నికల్‌ సిబ్బందికి రూ.11,500 ఇస్తున్నారు. కొత్త నోటిఫికేషన్‌లో కొత్తగా చేరేవారికి మాత్రం రూ.21,000 ఇవ్వాలని నిర్ణయించడం, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి రూ.11,500 ఇవ్వడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



జీతం పెంచకుండా పనిచేయించుకుంటున్నారు: అన్ని శాఖల రెగ్యులర్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింప చేశారు. ట్రామా కేర్‌లో పనిచేసే వారికి మాత్రం లేదు.  జీతం పెంచకుండా ఏళ్ల తరబడి పని చేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది. --- టి.మధు, బి.వెంకటేశ్వర్లు, ఆంబులెన్స్‌ డ్రైవర్లు



ఎలా బతకాలో అర్థం కావడం లేదు: ట్రామా కేర్‌లో క్యాడర్‌ను బట్టి కేవలం రూ.7,200 నుంచి రూ.12,900 ఇస్తున్నారు. మాకు సీనియారిటీ ఉన్నప్పటికీ తక్కువ జీతాలు ఇస్తున్నారు. కొత్తగా చేరేవారికి ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఇంత తక్కువ జీతాలతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు.---షేక్‌.రఫీ, ట్రామాకేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top