ప్రేమజంటకు పునర్జన్మ

ప్రేమజంటకు పునర్జన్మ - Sakshi


 పెళ్లికి అంగీకరించని పెద్దలు

 నిద్రమాత్రలు వేసుకుని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

 రక్షించిన సీఐ రవి


 

 అమ్మాయి.. అబ్బాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అడ్డుకోవడంతో కుంగిపోయారు. కలిసి బతకలేనప్పుడు కలిసి చావడమే మంచిదనుకున్నారు. లేఖ రాసి రైలు పట్టాలపై కూర్చున్నారు. కానీ ధైర్యం చాలక నిద్రమాత్రలు వేసుకున్నారు. ఇదంతా ఒక పోలీసు అధికారి గమనించారు. ప్రేమజంటను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు.. ఇది సినిమా కథ అనుకుంటే పొరపాటే. బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి జరిగిందీ సంఘటన. బొబ్బిలి సీఐ రవి అందించిన వివరాలివి.

 

 బొబ్బిలి: సీతానగరం మండలం రంగంపేట గ్రామానికి చెందిన పోల రవికుమార్, అదే గ్రామానికి చెందిన పెంట శాంతిలు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రవికుమార్ రిలయన్స్‌లో పనిచేస్తుండగా, శాంతి బొబ్బిలిలో డిగ్రీ చదువుతోంది. వేర్వేరు కుటుంబాలు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో కలిసి జీవించలేనప్పుడు కలిసి మరణించాలని ప్రేమికులు నిర్ణయించుకున్నారు.

 

 తొలుత పట్టాలపై పడుకుని...

 ఇద్దరూ మంగళవారం రాత్రి గ్రామం నుంచి బొబ్బిలి రైల్వే స్టేషనుకు చేరుకున్నారు. రైలు పట్టాలపై పడుకొని చనిపోయేందుకు ధైర్యం చాల్లేదు. దీంతో ఒక్కొక్కరు 11 నిద్ర మాత్రలు వేసుకుని రైల్వేస్టేషన్‌లోనే కూర్చున్నారు. రాత్రి పహరాలో భాగంగా రైల్వే స్టేషన్ వైపు సీఐ రవి వచ్చినపుడు వీరిద్దరూ కనిపించారు. సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వారిద్దరినీ విచారించారు. వారు రాసిన లేఖను స్వాధీనం చేసుకుని హుటాహుటిన ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగంపేటలోని శాంతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

 

 పోలీస్‌స్టేషన్‌కు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చినా రవికుమార్ కుటుంబ సభ్యులు రాలేదు. మేజర్లయిన తాము ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని.. రక్షణ కల్పించాలని ఆ యువజంట పోలీసులను వేడుకుంది. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వారికి అడ్డుపడరాదని శాంతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేయడంతో కథ సుఖాంతమైంది. మొత్తానికి సీఐ రవి చొరవతో ప్రేమజంటకు చావు తప్పింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top