పోటెత్తారు..

పోటెత్తారు..

భక్తులతో కిక్కిరిసిన లోవ దేవస్థానం

– రూ.4,19,845 ఆదాయం

– గంటలోనే నిండుకొన్న పులిహోర ప్రసాదం

– తల్లిని దర్శించుకున్న 40వేల మంది భక్తులు

తునిరూరల్‌  : ఆషాఢమాసం తొలి ఆదివారం తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులు, వాహనాలతో లోవ ప్రాంగణం నిండిపోయింది. 40వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్‌ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటసేపు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. పులిహోర ప్రసాదం విక్రయాలు చేపట్టిన గంటలోనే నిండుకున్నాయి. 25వేల రవ్వ లడ్డూ ప్రసాదాలను విక్రయాలకు అందుబాటులో ఉంచినట్టు ఈఓ తెలిపారు. వివిధ విభాగాల ద్వారా రూ.4,19,845 ఆదాయం లభించినట్టు ఈఓ చెప్పారు. భక్తుల రద్దీకనుగుణంగా వసతిగదులు, కాటేజీలు లేకపోవడంతో చెట్లకింద, ఆరుబయట, కొండదిగువన ఉన్న తోటల్లో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. తుని పట్టణ, రూరల్‌ సీఐలు శ్రీనివాస్, చెన్నకేశవరావుల ఆధ్వర్యంలో 80మంది పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రానున్న పర్వదినాల్లో భక్తుల సంఖ్య పెరగనుండడంతో మరింత పటిష్టంగా బందోబస్తుకు వంద మంది పోలీసులను కేటాయించాలని డీఎస్పీని కోరునున్నట్టు ఈఓ తెలిపారు. చైర్మన్‌ కరపా అప్పారావు, ధర్మకర్త యాదాల లోవకృష్ణ భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. శ్రీహరి సేవ భక్తులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు సేవలు అందించారు. 

25టియుఎన్‌104 : భక్తులతో రద్దీగా ఉన్న లోవదేవస్థానం ప్రాంగణం

25టియుఎన్‌105 : అమ్మవారిని దర్శించేందుకు క్యూలైన్లో వేచిఉన్న భక్తులు.

25టియుఎన్‌106 : వసతిగదుల్లేక చెట్లకింద వంటలు, భోజనాలు చేస్తున్న భక్తులు
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top