తెరతరాల చరిత

తెరతరాల చరిత - Sakshi

 సినిమా అంటే ఓ క్రేజ్‌.. ఓ అద్భుత ప్రపంచం. సామాన్యుడి నుంచి స్థితిమంతుడి వరకు తమ జీవితాలను సినిమాల్లోని పాత్రలకు అన్వయించుకుని మురిసిపోతుంటారు. హీరో, హీరోయిన్లను అనుకరిస్తూ ముందుకుసాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రజల జీవితాల్లో సినిమాలు ఓ భాగమైపోయాయి. సినిమాలు ప్రదర్శించే థియేటర్లలో కాలక్రమేణా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పటి టూరింగ్‌ టాకిస్‌ల నుంచి నేటి మల్టీఫ్లెక్స్‌ల స్థాయికి చేరుకున్నాయి. అడుగడుగునా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అబ్బురపరుస్తున్నాయి. సాంకేతికత పుణ్యమా అని భారీనష్టాల నుంచి లాభాల దిశగా థియేటర్లు పయనిస్తున్నాయి. సినిమా థియేటర్ల ప్రస్థానంపై ఈ వారం సండే స్పెషల్‌.

 

కొవ్వూరు రూరల్‌ : జిల్లాలో ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లిన సినిమా థిథియేటర్లు దశాబ్ద కాలం నుంచి రెండేళ్ల కిందటి వరకు భారీ నష్టాలతో మూతపడ్డాయి. చాలా థియేటర్లు షాపింగ్‌ కాంప్లెక్స్‌లుగా, రైస్‌మిల్లులుగా రూపాంతరం చెందాయి. పాతతరంలో ఎన్ని థియేటర్లు ఉన్నా తక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవడం వల్ల ఎక్కువ రోజులు ఆడి థియేటర్ల యజమానులకు లాభాలు పండించేవి. రానురాను వారం ఆడితే చాలు అనే స్థాయికి సినిమాలు మారిపోవడంతో థియేటర్ల యజమానులకు కష్టాలు మొదలయ్యాయి.

జిల్లాలో ప్రస్తుతం 100 థియేటర్లు

ఒకప్పుడు పల్లెటూళ్లలో టూరింగ్‌ టాకిస్‌లు ఉండేవి. చుట్టూ తడికలు కట్టి రాత్రిపూట మాత్రమే సినిమా ప్రదర్శించేవారు. వాటిస్థానంలో సినిమా థియేటర్లు వచ్చాయి. ఇరవై ఏళ్ల కిందట సుమారుగా 200 సినిమా థియేటర్లు జిల్లాలో ఉండేవి. అయితే రానురాను వీటి నిర్వహణ తలకుమించిన భారం కావడంతో పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 100 థియేటర్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా  75 శాతం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ప్రేక్షకుల సౌకర్యార్థం సెంట్రల్‌ ఏసీ, ఈజీ చైర్స్, డీటీఎస్‌డాల్బీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా ప్రదర్శించడంతో తిరిగి సినిమా థియేటర్లు పూర్వ వైభవాన్ని పొందుతున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో కొత్తగా థియేటర్లు నిర్మాణంలో ఉన్నాయంటే లాభాలు బాగున్నాయని అర్థం చేసుకోవచ్చు. 

 

రీల్‌ నుంచి శాటిలైట్‌ వైపు

సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో రీల్‌ నుంచి శాటిలైట్‌కు మార్పు చెంది నేడు సినిమా ప్రదర్శన జరుగుతోంది. థియేటర్‌ యాజమాన్యాలకు కూడా కొంత నిర్వహణ ఖర్చులు తగ్గడంతో ప్రస్తుతం లాభసాటిగానే ఉందని పలువురు యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమా రిలీజ్‌ అయితే శాటిలైట్‌ ద్వారా యూఎఫ్‌ఓ, క్యూబ్, ఆర్గవిస్ట్‌న్‌ వంటి సంస్థలు నేరుగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు హెల్పర్లు పనిచేసే స్థానంలో ఇప్పుడు ఇద్దరు పనిచేస్తే చాలు. దీంతో సిబ్బంది వేతనాల ఖర్చు తగ్గింది. శాటిలైట్‌ ద్వారా సినిమాలను ప్రదర్శిస్తుండడంతో ఎన్నిసార్లు వేసినా క్వాలిటీలో ఎటువంటి మార్పు రాదు. అదే రీల్‌ ద్వారా ప్రదర్శిస్తే రీల్‌ నలిగి క్వాలిటీలో తేడా వచ్చేది. 

 

సాంకేతిక మార్పులకు రూ.కోటి ఖర్చు

ప్రేక్షకుడికి సౌకర్యంగా ఉండేలా నేటి సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని థియేటర్లను మార్చు చేయాలంటే ప్రస్తుతం రూ. కోటి వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. ముఖ్యంగా సౌండ్‌ సిస్టమ్‌ (డీటీఎస్‌) మార్పుకు రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ ఖర్చవుతుంది. అంతే కాకుండా పాత థియేటర్లలో ఉన్న సీట్లను తొలగించి సౌకర్యవంతంగా ఉండే సీట్లు ఏర్పాటు చేయాలంటే ఒక్కో సీటుకు సుమారుగా రూ.5 వేలు ఖర్చవుతుంది. 300 నుంచి 400 వరకూ ప్రేక్షకులు కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిని బట్టి సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల మొత్తం అవసరమవుతుంది. అంతే కాకుండా థియేటర్‌ ముందుభాగం ఆకట్టుకునే విధంగా చేసేందుకు, ఇతర మరమ్మతులకు మిగిలిన మొత్తం అవసరం అవుతుంది. 

 

పర్సంటేజ్‌ల నుంచి అద్దెల విధానానికి మార్పు

గతంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా పర్సంటేజ్‌ రూపేణా థియేటర్‌ యాజమాన్యానికి నిర్మాతలు చెల్లించేవారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పర్సంటేజ్‌ల వల్ల ఒక్కోసారి నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి. సినిమా సక్సెస్‌ అయినప్పుడు ఎక్కువ పర్సంటేజ్‌ థియేటర్ల యాజమాన్యాలకు ఇవ్వాల్సి వస్తుందన్న భావన నిర్మాతల్లో కలగడంతో మార్పు అనివార్యమైంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలు థియేటర్లు ఎగ్జిబిటర్లతో అద్దె చెల్లించే విధంగా ఏడాది, ఆపై రోజులకు 

యాజమాన్యాలు ఆగ్రిమెంట్‌ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెద్ద పట్టణాల్లో రోజుకు రూ.15 వేల వరకూ, చిన్న పట్టణాల్లో రూ.10 వేల వరకూ అద్దె చెల్లిస్తున్నారు. సినిమా ప్రదర్శన బాధ్యత ఎగ్జిబిటర్లే తీసుకుంటున్నారు. నిర్వహణ పోను లాభ, నష్టాలతో సంబంధం లేకుండా అద్దె చెల్లిస్తుండంతో కొంత మేరకు ప్రస్తుతం థియేటర్ల యజమానులకు అనుకూలంగానే ఉంది. 

 

థియేటర్లు తగ్గినా పెరిగిన స్క్రీన్లు

ప్రస్తుతం ఒకే థియేటర్‌లో రెండు లేదా మూడు స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయి. ఒకే రోజు మూడు చిత్రాలను ప్రదర్శించగలుగుతున్నాయి. ఉదాహరణకు ఏలూరులో రెండు థియేటర్లలో మూడు స్క్రీన్లు, మరో రెండింటిలో రెండేసి స్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవి గతంలో ఒకే స్క్రీన్‌తో సినిమాను ప్రదర్శించిన థియేటర్లే.  

 

అధిక ధరలతో ప్రేక్షకుడికి భారం

ప్రస్తుతం పలు చోట్ల టిక్కెట్‌ ధరలు ప్రేక్షకుడికి భారంగా మారాయి. సినిమాకు నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే సుమారుగా రూ.వెయ్యి వదిలించుకోవాల్సిందే. రిలీజ్‌ సినిమాకు ప్రభుత్వ ధరలతో సంబంధం లేకుండా టిక్కెట్‌కు రూ.100 నుంచి రూ.150 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా తినుబండారాల ధరలు కూడా బయటకన్నా ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తుండడంతో నేటికీ సినిమాకు సామాన్యుడు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top