బిడ్డా లేవురా...!

బిడ్డా లేవురా...! - Sakshi


► కొడుకు మృతదేహంపై పడి కంటతడిపెట్టిన తండ్రి

► సంగుపేట వద్ద బైకును వెనుక నుంచి ఢీకొన్న లారీ

► అక్కడికక్కడే యువకుడి దుర్మరణం.




జోగిపేట(అందోలు): బిడ్డా లేవురా.. నీ చెల్లెలికి ఏమని చెప్పాలిరా?.. ఎంత పనిచేస్తివి దేవుడా? నేనన్నా చావకపోతి కదా.. అంటూ కన్నతండ్రి కొడుకు శవం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అక్కడి వారందరూ కంటతడిపెట్టారు. ఈ  సంఘటన మంగళవారం అందోలు మండలం సంగుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. కొడుకును ఇంజనీర్‌గా చూడాలనుకున్న తండ్రి ఆశలను మృత్యువు కబలించుకొని పోయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.



ఆశలు చిదిమేసిన లారీ

చిలప్‌చెడ్‌ మండలం సోమక్కపేట పంచాయతీ పరిధిలోని రహీంగూడ నివాసి మల్లేశం, కొడుకు నీరుడి ప్రశాంత్‌(17)తో కలిసి సంగారెడ్డి వైపు నుంచి జోగిపేటకు బైకుపై (టీఎస్‌ 15 ఇజె 4931)వస్తున్నారు. ఈ క్రమంలో అందోలు మండలం సంగుపేట గ్రామం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌ వెనుక కూర్చున్న ప్రశాంత్‌ అక్కడికక్కడే చనిపోగా తండ్రి మల్లేశం తలకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని బీజేఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్పించేందుకు ప్రశాంత్‌ను తీసుకొని మల్లేశం సోమవారం ఇంటి నుంచి వెళ్లాడు. ప్రశాంత్‌ను కళాశాలలో జాయిన్‌ చేసి రాత్రి సంగారెడ్డికి వచ్చారు. ఉదయమే ఇంటికి బైకుపై బయలుదేరారు. మరో అరగంటలో ఇంటికి చేరుదామనుకున్న సమయంలోనే లారీ వీరు ప్రయాణిస్తున్న బైకును వెనుక నుంచి ఢీకొని కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన మల్లేశంకు ప్రథమ చికిత్సలు చేశారు. ఎస్‌ఐ పరమేశ్వర్, వట్‌పల్లి సర్పంచ్‌ గణేష్‌లు మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఎన్‌ఎల్‌ఓ1ఎల్‌ 9469 నంబరుగల లారీని వదిలేసి డ్రైవర్‌ పారిపోయాడు. దీంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు.



వందలాదిగా ఆసుపత్రికి చేరుకున్న గ్రామస్తులు

సంఘటన విషయం తెలుసుకున్న రహింగూడ గ్రామస్తులు వందలాదిగా ఆసుపత్రికి, సంఘటన స్థలానికి బైకులు, ఆటోలలో చేరుకున్నారు. గ్రామంలో మంచి పేరు ఉన్న మల్లేశం కుమారుడు చనిపోవడంతో రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చారు. గ్రామ సర్పంచ్‌ లక్ష్మణ్‌ దగ్గరుండి పోస్టుమార్టం పనులు పూర్తి చేయించారు. ఆస్పత్రి ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పరమేశ్వర్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top