అవినీతి అనకొండలు.. నారా బాబులు

అవినీతి అనకొండలు.. నారా బాబులు - Sakshi


► దోచుకోవడం.. దాచుకోవడమే వారి లక్ష్యం

► వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి




భవానీపురం (విజయవాడ పశ్చిమ) : అభివృద్ధి, అవినీతిలో నవ్యాంద్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలుపుతానని అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు, అభివృద్ధి మాటెలా ఉన్నా అవినీతిలో మాత్రం నిజం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. అన్నింటిలోనూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్న చంద్రబాబు, ఇసు క, ల్యాండ్‌ మాఫియాను ప్రోత్సహిస్తూ అందినకాడికి దండుకుంటున్న ఆయన తనయుడు చినబాబును  అవినీతి అనకొండలుగా అభివర్ణించారు.



వైఎస్సార్‌ సీపీ నగర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన పదిలం రాజశేఖర్‌ అభినందన సభ భవానీపురంలోని సాయి అన్న గార్డెన్స్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వెలంపల్లి ప్రసంగిస్తూ దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా ఇద్దరు బాబులు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తాము వేయించిన రోడ్లుపై నడుస్తూ, తామిచ్చే పెన్షన్, రేషన్‌ తీసుకుంటూ టీడీపీకి ఎందుకు ఓట్లేయరని, అవసరమైతే ఓటుకు రూ.5 వేలు ఇచ్చయినా కొనగలనని చెప్పటం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు. అవినీతికి పాల్పడకపోతే ఓటుకు రూ.5 వేలు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు.



తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి భయపడుతున్న చంద్రబాబు మతి స్థిమితం కోల్పోతున్నారన్నారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే జలీల్‌ఖాన్‌తో రాజీనామా చేయించి అదే స్థానంలో నిలబెట్టాలని, ఆయనపై తాను పోటీ చేసి గెలిచి పశ్చిమ సీటును జగన్‌కు కానుకగా సమర్పిస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, అప్పుడే రాజన్న పాలన వస్తుందని చెప్పారు.


పదిలం యువసేన ఆధ్వర్యంలో పార్టీ నగర అధికార ప్రతినిధి ఏలూరు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్‌ గౌస్‌ మొహిద్దీన్, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, మైలవరపు దుర్గారావు, కట్టా మల్లేశ్వరరావు, మనోజ్‌ కొఠారి, లేళ్ల లాజర్, సంకా పరమేశ్వరరావు, విశ్వనాధరవి, పడిగపాటి సుబ్బారెడ్డి, గుడివాడ నరేంద్ర, కంపా గంగాధరరెడ్డి, పోలిమెట్ల శరత్, పిళ్లా సూరిబాబు, ఏనుగుల సునీల్, షకీల్, ఏపీ భాస్కరరావు, ఎం.చటర్జీ, అనుమాలశెట్టి జ్యోతి, కె.విద్యాధరరావు, వెన్నం రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెలంపల్లి, రాజశేఖర్‌ను గజమాలతో సత్కరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top