అడిగేదెవరు.. ఆపేదెవరు!


  • మాస్టర్ ప్లాన్ పనుల్లో ఇష్టారాజ్యం

  • నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్

  • నాసిరకంగా భూగర్భ డ్రెయినేజి, తాగునీటి పైపులైన్ పనులు

  • ఎక్కడా అడ్డుకోలేని అధికారులు

  • బదిలీలకు ముందు రోజు హడావుడిగా రూ.4.07 కోట్లు మంజూరు

  • సూపర్ చెక్ లేకుండానే బిల్లుల చెల్లింపు

  •  

    మాస్టర్ ప్లాన్.. పేరుకు తగినట్లే పనుల్లోనూ అవినీతి పద్ధతిగా సాగుతోంది. అభివృద్ధి పనుల్లో  నాణ్యతకు తిలోదకాలిచ్చినా.. గడువులోపు పనులు పూర్తి చేయకపోయినా.. చర్యలు  తీసుకోవాల్సింది పోయి బిల్లులు చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా.. ఏ స్థాయిలోనూ ఈ కాంట్రాక్టు సంస్థను ఇదేమని ప్రశ్నించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. నాలుగు రోజుల వ్యవధి.. రూ.4.07 కోట్ల బిల్లు.. ఒకే రోజు ఏఈలు, డీఈ, ఈఈ, ఈఓ సంతకాలు.. అదే రోజు ఆడిట్ కార్యాలయంలోనూ ఆమోద ముద్ర పడటం చూస్తే.. ఈ సంస్థ ఎంత చాకచక్యంగా పనులు  చక్కబెడుతుందో తెలుస్తోంది.

     

    దేవుని సన్నిధిలో పనులు చేయడమంటే.. అంతో ఇంతో భయం సహజం. శ్రీశైల క్షేత్రంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.137 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి విడత పనులను పరిశీలిస్తే కాంట్రాక్టర్‌కు ఆ భయమనేది లేదనే విషయం ఇట్టే అర్థమవుతుంది. తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజి, పిలిగ్రిమ్ షెడ్లు, పుష్కరిణి తదితర పనుల్లో నాణ్యత మచ్చుకైనా కనిపించదు. అభివృద్ధి మాటున జరుగుతున్న దోపిడీకి ఇక్కడి అధికారులు కూడా వంత పాడుతుండటం గమనార్హం.

     

    కొన్ని చోట్ల పనులు పూర్తి కాకుండానే లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక మంచినీటి సరఫరా పైపు లైన్ పనులు అవినీతికి పరాకాష్టగా చెప్పవచ్చు. వాస్తవానికి పైపులైన్ ఏర్పాటుకు తవ్వకం పూర్తయ్యాక ఆ మార్గంలో ఎక్కడా ఎగుడుదిగుడు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కాంక్రీట్‌తో సమాంతరంగా 18 అంగుళాల వెడల్పుతో బెడ్డింగ్ వేయాలి. అనంతరం పైపులను అమర్చి ఇరువైపులా మెత్తటి గ్రావెల్ నింపాలి. శ్రీశైలంలో చేపడుతున్న పనుల్లో ఈ ప్రక్రియకు నీళ్లొదిలారు. పైపులైన్ కింద భూమిని చదును చేయకపోగా.. కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కూడా విస్మరించారు. పైపులను రాళ్లు ఆధారంగా ముందుకు తీసుకెళ్లడం.. వీటి కింద ఫ్లైయాష్(కంకర పొడి) చల్లి చేతులు దులుపుకున్నారు.

     

     సూపర్ చెక్ ఎక్కడ?

     వాస్తవానికి ఈ పనులన్నింటినీ ఇంజినీరింగ్ అధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలి. అలాంటిది పనులను పర్యవేక్షిస్తున్న ఏఈలు కూడా ఎక్కడా అభ్యంతరం చెప్పకపోవడంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కనీసం బిల్లుల చెల్లింపు సమయానికి ముందు పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. ఇంజినీరింగ్ ఉన్నతాధికారి స్వయంగా ఈ పనులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి సూపర్ చెక్ చేయాలి. మ్యాన్ హోల్స్‌లో నీరు పోసి పక్కనే ఉన్న మ్యాన్‌హోల్స్ వరకు సాఫీగా ప్రవాహం ఉందా అన్నది పరిశీలించాలి. కానీ, భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పైపులైను పనుల్లో కళ్లు మూసుకుని బిల్లులు చేయడం గమనార్హం.


    హడావుడిగా రూ.కోట్ల చెల్లింపులు

    నాణ్యత లేని పనులకు ఆలయ అధికారులు హడావుడిగా ఎందుకు బిల్లులు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. శివాజీ రాజా గోపురం పనుల్లోనూ చేయని పనులకు ముందస్తుగా సుమారు రూ.60 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలోనూ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో దేవస్థానానికి చెందిన 26 మంది ఉద్యోగులు ఉన్నారు.


    ఆ జాబితాలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారి, అధికారుల పేర్లు ఉండటంతో.. కాంట్రాక్టర్ తెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అధికారులు కుమ్మక్కవడంతో ఏకంగా నాలుగు రోజుల వ్యవధిలో రూ.4.07 కోట్లకు సంబంధించిన బిల్లు పాసవడం చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top