జీవచ్ఛవంలా...

జీవచ్ఛవంలా...

  • రోడ్డు ప్రమాదంతో ఛిద్రమైన జీవితం

  • మాట తప్ప శరీర స్పర్శ కోల్పోయిన వైనం

  • ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

  • కళ్లముందు ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దదైన కూతురికి పెళ్లి చేశారు. ఆమె ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తోందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఓ శుభకార్యానికి వెళ్తుండగా చోటు  చేసుకున్న రోడ్డు ప్రమాదం... కుమార్తె జీవితాన్ని ఛిద్రం చేసింది. మాట తప్ప శరీరానికి స్పర్శలేకుండా పోయి.. మంచానికే పరిమితమైంది. రూ. లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా నయంకాకపోవడంతో చివరకు జీవచ్ఛవంలా మారిపోయింది. ప్రస్తుతం వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక, ఉన్న పిల్లలకు చదువు చెప్పించలేక ఆపన్నహస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.


     


    ధర్మవరంలోని హౌసింగ్‌ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న నార్పల నాగిరెడ్డి, అనసూయమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె లక్ష్మికి 17 ఏళ్ల క్రితం నార్పలకు చెందిన ప్రభాకరరెడ్డితో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నార్పలలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌గా ప్రభాకర్‌రెడ్డి, ఇంటి వద్దనే టైలరింగ్‌ చేస్తూ లక్ష్మి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. 


    తిరుపతికి వెళ్తూ...


    లక్ష్మి తమ్ముడు హేమసుందర్‌రెడ్డి కుమారుడి పుట్టు వెంట్రుకలు తిరుపతిలో తీయించేందుకు 2011 నవంబర్‌ 26న కుటుంబసభ్యులందరూ ఒకే వాహనంలో బయలుదేరారు. రాత్రి పూట ప్రయాణించే సమయంలో యూటర్న్‌ ఉన్న రోడ్డును డ్రైవర్‌ గమనించకపోవడంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. ఘటనలో నాగిరెడ్డి, అనసూయమ్మ, లక్ష్మి, ఆమె భర్త ప్రభాకరరెడ్డి, బంధువు హనుమంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.


    లక్ష్మికి మెడపై నరాలు దెబ్బతిని, శరీరంలో చలనం లేకుండా పోయింది. అప్పటి నుంచి అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చికిత్సలు చేయించారు. దాదాపు రూ. 40 లక్షల వరకూ ఖర్చు చేసి తల్లిదండ్రులు చికిత్సలు చేయించారు. ఆయినా లక్ష్మిలో ఏ మార్పురాలేదు. దీంతో ఆమె మంచానికే పరిమితమైపోయింది. తలకు గాయాలు నయమైపోవడంతో ప్రభాకరరెడ్డి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను తిరిగి చూడలేదు. భార్యాపిల్లల బాగోగుల గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో లక్ష్మి పోషణ భారం తల్లిదండ్రులపై పడింది. మనవడు చరణ్‌తేజ్, మనవరాలు కీర్తిని చదివించడంతోపాటు కూతురు లక్ష్మికి చికిత్సలు చేయిస్తూ వస్తున్నారు.


    పొలం అమ్మిన డబ్బుతో..


    ధర్మవరం డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌శాఖలో హెల్పర్‌గా పనిచేసిన నాగిరెడ్డి.. తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన పీఎఫ్‌ డబ్బు రూ. 15 లక్షలను కూతురు వైద్యం కోసం ఖర్చు చేశాడు. అదీ చాలకపోవడంతో చెన్నేకొత్తపల్లి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల భూమిని రూ. 10 లక్షలకు అమ్మి చికిత్స చేయించారు. ఇంకా బంధువుల వద్ద అప్పులు చేశారు.


    మూడేళ్లు ఆస్పత్రుల్లోనే....


    ప్రమాదానికి గురైన తర్వాత మూడేళ్ల పాటు బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో లక్ష్మిని ఉంచి చికిత్స చేయించారు. క్రమేణ ఖర్చు పెరిగిపోతుండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు నెలకు రూ. 10 వేలు వెచ్చించి ఏడాది పాటు ఇద్దరు వైద్యులతో ఫిజియోథెరఫీ చేయించారు. చేతుల్లో చిన్నపాటి కదలిక వచ్చినా.. ఉపయోగం లేకుండా పోయింది.


    ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..


    లక్ష్మికి చికిత్స చేయించేందుకు ప్రస్తుతం డబ్బుల్లేక నాగిరెడ్డి దంపతులు అప్పు చేస్తున్నారు. ఆమెకు వైద్యం చేయించేందుకే ఇబ్బంది పడుతున్న తమకు పిల్లల చదువులు అదనపు భారంగా మారాయి. తాము బతికుండగానే కుమార్తెను మాములు మనిషిగా చూడాలనే తపన వారిలో నానాటికీ పెరిగిపోతోంది. దేవుడు చిన్నచూపు చూసి తాము ముందుగానే చనిపోతే చిన్న పిల్లలతో తమ కూతురు ఎలా జీవిస్తోందోనన్న వేదన వారిని మరింత కుంగదీస్తోంది. ఎవరైనా పెద్ద డాక్టర్లు, ప్రభుత్వం స్పందించి తమ కూతురు లక్ష్మిని మాములు మనిషిగా చేయాలని వృద్ధ దంపతులు కోరుకుంటున్నారు. చికిత్స కోసం దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు.


     


    సాయం చేయదలిస్తే..


    పేరు : నార్పల నాగిరెడ్డి


    బ్యాంక్‌ ఖాతా నం. : 11095747799


    బ్యాంక్‌ శాఖ : స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ధర్మవరం, అనంతపురం జిల్లా


    ఐఎఫ్‌ఎస్‌ కోడ్ : ఎస్‌బీఐఎన్‌0000250


    ఫోన్‌ : 99855 60894

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top