సు‘దూర విద్య’

సు‘దూర విద్య’


ఎస్కేయూ దూరవిద్య నూతన నోటిఫికేషన్‌ జారీపై తొలగని ప్రతిష్టంభన

డెబ్‌ అనుమతి తీసుకరావడంలో కొరవడిన చిత్తశుద్ధి

ఇప్పటికే ఒక విద్యాసంవత్సరం వెనుకబడిన విద్యార్థులు

పొరుగు వర్సిటీలకు పెరుగుతున్న డిమాండ్‌




ఎస్కేయూ: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 219 అధ్యయన కేంద్రాలను కలిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం నిర్వీర్యమై పోతోంది. ఈ విభాగంలో గతంలో పనిచేసిన అధికారుల ఉదాసీనత వల్ల ఇప్పటికే ఏడాది విద్యాసంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోయారు. డెబ్‌ (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో) అనుమతి తీసుకురావడంలో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా 25 వేల మంది విద్యార్థులు ఎస్కేయూ దూరవిద్య విభాగంలో అడ్మిషన్లు పొందేవారు.



నోటిఫికేషన్లు జారీ చేసిన వర్సీటీలు

ఎస్కేయూ దూరవిద్యా విభాగం తప్ప ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వర్సిటీలతో పాటు పొరుగు వర్సిటీలన్నీ దూరవిద్య పీజీ, డిగ్రీ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఎస్కేయూ దూరవిద్య విభాగం నుంచి 2016–17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్‌ నేటికీ జారీ కాలేదు. ఇక 2017–18 విద్యాసంవత్సరం నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సైతం డెబ్‌ అనుమతి లేకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. డెబ్‌ గుర్తింపు తీసుకురావడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధి కొరవడినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాకపోవడంతో విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు దూరమయ్యాయి. దీంతో చాలా మంది విద్యార్థులు పొరుగు వర్సిటీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.



దూరవిద్య విభాగంలో సంస్కరణలు

ఎస్కేయూ దూరవిద్య విభాగంలో సంస్కరణలు చేపట్టనున్నారు. ప్రింటెండ్‌ మెటీరియల్‌ స్థానంలో ఆన్‌లైన్‌ మెటీరియల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలో నూతన మెటీరియల్‌ రూపకల్పనలో ఇప్పటికే నిష్ణాతులైన ప్రొఫెసర్లు నిమగ్నమయ్యారు. ఆన్‌లైన్‌ మెటీరియల్‌ అందుబాటులోకి వస్తే ..వృథా  వ్యయంతో పాటు కాలమూ ఆదా అవుతుందని ఎస్కేయూ యాజమాన్యం భావించింది. మెటీరియల్‌ రూపకల్పనతో పాటు నూతన నోటిఫికేషన్‌కు జారీ చేసే అంశం, డెబ్‌ అనుమతి తీసుకురావడానికి అవలంబించాల్సిన అంశాలపై దూరవిద్య సలహా సమీక్ష సమావేశాన్ని వచ్చే వారంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పొరుగు వర్సిటీల తరహాలోనే నూతన నోటిఫికేషన్‌ ఇస్తే మంచిదా? డెబ్‌ అనుమతి వచ్చే వరకు నోటిఫికేషన్‌ నిలుపుదల చేస్తారా? అనే అంశంపై స్పష్టత రానుంది.



ఇప్పటికే అనుమతి కోరాము

‘డెబ్‌ (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో) అనుమతి తీసుకురావడానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించాం. ఒక విద్యాసంవత్సరం వృథా కావడంతో డెబ్‌ అనుమతి వచ్చేంత వరకూ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి అనుమతి తీసుకరావడానికి నూతన ఫార్మాట్‌కు అనుగుణంగా వివరాలు పంపాం.’

– ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు, దూరవిద్య డైరెక్టర్, ఎస్కేయూ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top