ఆరోపణలు నిరూపించాలి

ఆరోపణలు నిరూపించాలి - Sakshi


విపక్షంపై ధ్వజమెత్తిన లోకేశ్

 

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే తనపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా స్వచ్ఛందంగా వెళ్లి జైల్లో కూర్చుంటానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో జరిగే వేల కోట్ల అవినీతిలో తనకు వాటాలు ఉన్నాయనడం ఘోరమన్నారు. సీఎంలుగా తన తాత, తండ్రి ప్రజల్లో సాధించిన మంచి పేరు తెచ్చుకుంటానో లేదోకాని తండ్రికి చెడ్డ పేరు తెచ్చే ప్రసక్తే లేదన్నారు.



శనివారం ఉదయం తిరుపతి మహానాడులో తెలంగాణ ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యంపై తీర్మానాన్ని లోకేశ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీలు ఆయా నేతలకు కనబడటం లేదన్నారు. కులమత విద్వేషాలు రెచ్చగొట్టి, అరటి తోటలకు నిప్పుపెట్టి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. తుని విధ్వంసంపై పోలీసుల విచారణ జరుగుతోందనీ, కారకులు జైలుకెళ్లడం ఖాయమన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. టీడీపీ ఆంధ్రా పార్టీ అని అంటున్న కేసీఆర్ మొదలుకొని ఆ పార్టీ ప్రధాన నేతలంతా టీడీపీ నుంచి వెళ్లిన వారేనని గుర్తించాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top