రుణపాశం

రుణపాశం - Sakshi

  • బ్యాంకులు రుణాలివ్వకపోవడమే

  •  రైతు ఆత్మహత్యలకు కారణమని అధికారుల నిర్ధారణ

  • సకాలంలో రుణాలందకే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి

  • పంటలు ఎండటం.. అధిక వడ్డీలు, అప్పులు తిరిగి చెల్లించలేని దైన్యం

  •  కుటుంబం ఎలా గడవాలన్న ఆవేదనతో రైతుల బలవన్మరణాలు

  •  దుర్భర స్థితిలో వారి కుటుంబాలు.. ఆగిపోయిన చదువులు

  • 108 రైతు కుటుంబాలకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పరామర్శ

  • వారి పరిస్థితి, ఆదుకోవాల్సిన చర్యలతో నివేదికలు

  •  అన్ని ఆత్మహత్యలూ వ్యవసాయ సంబంధమైనవేననే అభిప్రాయం

  •  ‘ఆత్మహత్యకు సమీపం’లో ఉన్న రైతులను ఆదుకోవాలని సూచన

  •  సాక్షి, హైదరాబాద్:  ‘‘మీ నాయన అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చచ్చినంత మాత్రాన అప్పు తీర్చలేమంటే కుదరదు. మంది సొమ్ము తిని ఎగ్గొట్టడానికి సిగ్గుండాలి. అప్పు ఎట్లా తీర్చుతావో నాకు తెలియదు. ఒళ్లు అమ్ముకుంటావో, మరేం చేస్తావో తెలియదు. అప్పు తీర్చాల్సిందే..’’... ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబంలో పెళ్లీడుకొచ్చిన యువతితో ఒక వడ్డీ వ్యాపారి అన్న నీచమైన మాటలివి.

     ఈ మాటలతో తీవ్రంగా చలించిపోయిన ఆ యువతి తానూ ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీట మునిగిపోయింది. ఇదే కాదు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాష్ట్ర వ్యవసాయాధికారులు పరామర్శించిన సందర్భంలో ఇలాంటి ఎన్నో కన్నీటి గాథలు వెలుగుచూశాయి. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడం, దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి రావడం... ఆ అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళన, కుటుంబం ఎలా గడవాలన్న ఆవేదనే రైతుల ఆత్మహత్యలకు కారణమని అధికారులు గుర్తించారు.

     ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లోని ఓ గ్రామానికి చెందిన రైతుకు కొడుకు పుట్టాడు. కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఆ రైతు అదేరోజు సాయంత్రంఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ఇల్లాలి ఆవేదన వర్ణనాతీతం. వరంగల్‌కు చెందిన ఓ రైతు కుమార్తె బీటెక్ చదువుతోంది. తండ్రి బతికున్నప్పుడు కాలేజీకి రానుపోను బస్ చార్జీలకు రోజుకు రూ.20 ఇస్తుండేవాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాక ఆ డబ్బు కూడా లేక ఆమె కాలేజీకి వెళ్లడం మానేసింది. ఈ ఘటనలు చాలు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు ఎంతటి దీనస్థితిలో ఉన్నాయో. ‘పత్రికల్లో రైతుల ఆత్మహత్య వార్తలు వస్తే అయ్యో పాపం అనుకునేవాడిని. కానీ వారి కుటుంబాలను పరామర్శించినప్పుడు వెలుగు చూసిన దారుణాలు విని కన్నీరు ఆపుకోలేకపోయాను. వారి ఆవేదన, సంఘర్షణ మాటల్లో చెప్పలేను..’’ అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

     అంతా చిన్న రైతులే..

     సెప్టెంబర్ ఒక్క నెలలోనే 134 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రస్థాయి వ్యవసాయ బృందం అందులో 108 బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ సందర్భంగా వారి దృష్టికి వచ్చిన  అంశాలు, ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలతో నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది. అధికారుల పరిశీలనలో వెల్లడైన అంశాలేమిటంటే... ఆత్మహత్య చేసుకున్న వారంతా సన్న, చిన్నకారు రైతులే. వారెవరికీ రెండెకరాలకు మించి భూమి లేదు. దీంతో మరికొంత భూమి కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారు. నష్టపోయి అప్పులపాలయ్యారు. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎక్కువ మంది 30 నుంచి 50 ఏళ్లలోపు వారే. ఆత్మహత్యలకు ప్రధాన కారణం వాణిజ్య పంటలు వేయడం, సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు అప్పులు చేయడమే.



    చివరకు వర్షాభావం కారణంగా పంట నష్టం జరగడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో గత రెండేళ్లుగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో వారికి ప్రైవేటు రుణాలే దిక్కయ్యాయి. అవే వారిని పొట్టనపెట్టుకున్నాయి. ‘‘ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మేమేం మాట్లాడినా ఇబ్బందే. కానీ రైతు ఆత్మహత్యలపై సర్కారు లెక్కలన్నీ తప్పే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్నీ నిజమైనవే. కేవలం వ్యవసాయ సంబంధమైనవి అంటూ సగానికి సగం తగ్గించడం సిగ్గుచేటు. అసలు అప్పుల కారణంగానే రైతు కుటుంబాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. అవి నిజమైనవి కావనడం శోచనీయం..’’ అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

     ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి పరిస్థితేమిటి?

     ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అందులో రూ.లక్ష వన్ టైం సెటిల్‌మెంట్ కింద వారి అప్పులు తీర్చేందుకు కేటాయించింది. కానీ ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో, ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేదనలో ఉన్న రైతుల కుటుంబాల పరిస్థితి, వారి అప్పులను పట్టించుకోవాల్సి ఉందని అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రైవేటు వ్యాపారులను, బ్యాంకర్లను, రైతులను కూర్చోబెట్టి అప్పులపై వన్ టైం సెటిల్‌మెంట్ చేయాలని... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల రక్షణకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రత్యేక భరోసా ఇవ్వకపోవడంతో వారు సామాజిక బహిష్కరణకు గురవుతున్నారని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

     ======================

     అధికారుల పరిశీలనలో మూడు కుటుంబాల పరిస్థితి

     

     రైతు: ఎట్టబోయిన ఆదయ్య

     ఆధారపడి ఉన్నవారు: నలుగురు పిల్లలు, భార్య అనారోగ్యంతో ఉంది.

     ఊరు: గీసుకొండ, వరంగల్ జిల్లా

     అప్పు: ప్రైవేటు రూ.30 వేలు, బ్యాంకు రుణం రూ.80 వేలు

     సిఫార్సు: కుటుంబం గడవాలంటే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

     ------------

     2) రైతు: ఎండగట్ల రాజు

     ఆధారపడి ఉన్నవారు: భార్యాపిల్లలు, తల్లి, వికలాంగ సోదరుడు

     గ్రామం: పోతారం, వరంగల్ జిల్లా

     భూమి: సొంత భూమి 1.30 ఎకరాలు, కౌలుకు తీసుకున్నది 3 ఎకరాలు

     అప్పు: రూ.7 లక్షలు (5 శాతం వడ్డీతో ప్రైవేటు అప్పు)

     సిఫార్సు: కుటుంబం గడవాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

     -----------

     3) రైతు: ఎన్.శ్రీను (43)

     ఆధారపడి ఉన్నవారు: భార్య, ఇద్దరు పిల్లలు

     గ్రామం: ఎల్కుర్తి హవేలి, గీసుకొండ

     భూమి: సొంత భూమి 0.20 ఎకరాలు, కౌలుకు 4 ఎకరాలు

     అప్పు: 3 లక్షలు (5 శాతం వడ్డీతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద)

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top