కొత్త జిల్లాలపై లీగల్‌ కమిషన్‌ నియమించాలి

సిరిసిల్లలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి - Sakshi

  • తండ్రీ కొడుకుల కుట్రల్ని భగ్నం చేస్తాం

  • శంషాబాద్‌ జిల్లాను రద్దు చేయండి

  • సిరిసిల్ల జిల్లా ఇవ్వండి

  • మంత్రి కేటీఆర్‌ క్యాట్‌వాక్‌ చేస్తున్నారు

  • జిల్లా కోసం బహిరంగ సభ పెట్టండి

  • టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి

  • సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, విధివిధానాలపై సిట్టింగ్‌ జడ్జితో లీగల్‌ కమిషన్‌ నియమించాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరుగుతున్న జిల్లా సాధన ఉద్యమానికి ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్‌ రాష్ట్ర మంత్రి అయి సమంతతో క్యాట్‌వాక్‌ చేస్తున్నారని విమర్శించారు.



    తెలంగాణ రాష్ట్రంలో తండ్రీ కొడుకుల కుట్రలను కళ్లు తెరిచి భగ్నం చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనుల్లో కోట్ల ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు జిల్లా కోసం ఉద్యమిస్తుంటే ప్రజల పక్షాన ఉండి జిల్లా ఏర్పాటు చేయాల్సిన మంత్రి పోరాడే బిడ్డలపై లాఠీఛార్జి చేయించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై లాఠీచార్జి చేశారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ బంధువులకు శంషాబాద్‌లో వందల ఎకరాలున్నాయని జిల్లా చేస్తున్నారని ఆరోపించారు. శంషాబాద్‌ను రద్దు చేసి సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్‌ చేశారు.



    జిల్లా కావాలని అక్కడ ఎవరూ అడుగడం లేదన్నారు. సిరిసిల్ల ప్రజలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని, జిల్లా కోసం సిరిసిల్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్టీల వారితో సభ నిర్వహించాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా కోసం శాసనసభలో గళం విప్పుతానని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ఇవ్వకుంటే టీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూల్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ చైర్మన్‌ దరువు ఎల్లన్న, జిల్లా సాధన జేఏసీ నేతలు రమాకాంత్‌రావు, కత్తెర దేవదాస్, అన్నమనేని నర్సింగరావు, మహేశ్‌గౌడ్, జక్కుల యాదగిరి, ఆడెపు రవీందర్, బుస్సా వేణు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top