'తాత్కాలిక' దోపిడీ

'తాత్కాలిక' దోపిడీ - Sakshi


వెలగపూడిలో సచివాలయ నిర్మాణ వ్యయం అడ్డగోలుగా పెంపు

12 లక్షల చదరపు అడుగులకు కావాల్సింది రూ.360 కోట్లే

ఇప్పటికే రూ.851 కోట్ల మంజూరుకు జీవోలు జారీ

మరో రూ.150 కోట్లు అవసరమని అంచనా

యథేచ్ఛగా ప్రభుత్వ పెద్దల కమీషన్ల దందా


 సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది.నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం అనూహ్యంగా పెంచేస్తోంది. తాత్కాలిక సచివాలయం కోసం రూ.వందల కోట్లు  ఖర్చు చేయడం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నా సర్కారు లెక్కచేయడం లేదు. కొత్త రాజధానిలో భూ దందాతో రూ.వేల కోట్లు దోచేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ అడ్డగోలు దోపిడీకి తెరతీశారు.


వెలగపూడిలో చేపట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం రూ.1,000 కోట్లకు పైగా వ్యయం కానుందని ఓ అధికారి తెలిపారు.ఈ వ్యయానికిగాను రూ.851 కోట్ల మంజూరుకు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. మరో రూ.150 కోట్లు మంజూరు చేయాలని సమాచారం. తొలుత రూ.180 కోట్లతోనే నిర్మించాలని అంచనాకొచ్చిన ప్రభుత్వం విడతలవారీగా రూ.1,000 కోట్లకు పెంచేసిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.


 అదన ంగా రూ.40 కోట్లకు ఒప్పందం

హైదరాబాద్‌లో చదరపు అడుగు నిర్మాణానికి దాదాపు రూ.3వేలు వ్యయమవుతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో కూడా చదరపు అడుగుకు రూ.3,000 చొప్పున 12 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.360 కోట్ల కంటే ఎక్కువ వ్యయం కాకూడదు. కానీ, ఇది రూ.1,000కోట్లకు చేరింది. తొలుత 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్ల మంజూరుకు జీవో జారీ చేసింది. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) టెండర్లను ఆహ్వానించింది.


ఎల్‌అండ్‌టీ, షాపూర్జీ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.అనుమతుల కంటే ఎక్కువ మొత్తానికి టెండర్లు దాఖలయ్యాయి. దీంతో సీఆర్‌డీఏ ఆ రెండు సంస్థలతో చర్చలుజరిపింది. అదనంగా రూ.40 కోట్లు చెల్లించేందుకు ఓకే చేసింది. దీంతో నిర్మాణ వ్యయం రూ.220 కోట్లకు చేరింది. ఆ తరువాత డ్రైనేజీ, పారిశుధ్యం, విద్యుత్ పనుల పేరిట రూ.101 కోట్లు మంజూరు చేసింది. వీటన్నింటిని కలిపితే రూ.321 కోట్లు మంజూరు చేసినట్లైంది.


మరో రూ.530 కోట్లకు అనుమతి

తాజాగా తాత్కాలిక సచివాలయంలో మరో 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు అంతస్తుల తో పాటు అంతర్గత పనులకు రూ.530 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇలా రెండు అంతస్తుల నిర్మాణం, డ్రైనేజీ, అంతర్గత పనులు, ఫర్నిచర్‌కు రూ.530 కోట్లకు అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం రూ.851 కోట్లకు అంగీకరించినట్లు లెక్క. పనులు పూర్తయ్యేసరికి మరో రూ.150 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top