నేతల చేతుల్లో లాఠీ

నేతల చేతుల్లో లాఠీ

ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం?

– సిఫారసు లేఖ ఉన్న వారికే పోస్టింగులు 

– 15 మంది సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం

- ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లకు పోటీ

- నాయకుల చుట్టూ కొందరి ప్రదక్షిణ

– బదిలీల జాబితా వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం

 

కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్ల బదిలీల చర్చ జోరుగా సాగుతోంది. సుమారు 15 మందికి పైగా సీఐలకు ఈ విడత స్థానచలనం తప్పనిసరి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులతో పాటు వారికి సన్నిహితంగా మెలిగే ద్వితీయ శ్రేణి నాయకుల చుట్టూ కొందరు ఇన్‌స్పెక్టర్లు చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో సర్కిళ్లతో కలిపి ఉన్నవి 19, అప్‌గ్రేడ్‌ సర్కిళ్లు 14. ఇన్‌స్పెక్టర్ల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉండటంతో పోటీ తీవ్రమయ్యింది. వివిధ ఆరోపణలతో ప్రస్తుతం 12 మంది ఇన్‌స్పెక్టర్లు వీఆర్‌లో ఉన్నారు. వీరంతా తిరిగి స్టేషన్‌ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు ఆదేశాల మేరకు కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణతో చర్చించి బదిలీల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరో వారం రోజుల్లో బదిలీల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రాధాన్యత కలిగిన సర్కిళ్ల కోసం ఇన్‌స్పెక్టర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం.

 

మొదటి నుంచీ తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే..

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 డిసెంబర్‌ మొదటి వారంలో నియోజకవర్గ పరిధిలో 37 మంది సీఐలకు బదిలీలు జరిగాయి. తమ వారికి తగిన స్థానాలు దక్కలేదనే కారణంతో తెలుగు తమ్ముళ్లు అప్పట్లో బ్రేకులు వేయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 14 మంది, అక్టోబర్‌ మొదటి వారంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. ఈ బదిలీల్లో కూడా నాయకులు ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగానే జాబితా సిద్ధమైనట్లు సమాచారం. పోస్టింగులు ఆశిస్తున్న ఇన్‌స్పెక్టర్లు మరికొంత మంది నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బదిలీల్లో వీఆర్‌లో ఉన్న సుమారు 9 మందికి పోస్టింగులు దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీఆర్‌లో ఉన్న పలువురు ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల సిఫారసు లేఖల కోసం ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

 

రెండేళ్లు పూర్తయిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత

రెండేళ్ల పాటు ఒకే సర్కిల్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లకు బదిలీ తప్పదనే చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత  కలిగిన సర్కిళ్ల కోసం ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఏళ్ల తరబడి లూప్‌లైన్‌ పోస్టుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్లు కూడా సర్కిళ్లను దక్కించుకునేందుకు అధికారులపై ఒత్తిడి చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం డీసీఆర్‌బీలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా కర్నూలు వన్‌టౌన్‌ పోస్టింగ్‌ వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం శ్రీశైలంలో పనిచేస్తున్న సీఐ పార్థసారధితో పాటు మరో ఇద్దరు శ్రీశైలం సర్కిల్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వన్‌టౌన్‌లో పనిచేస్తున్న కృష్ణయ్య కోసిగి సర్కిల్‌లో పాగా వేసేందుకు ఆ ప్రాంత నాయకుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. శిరివెళ్లలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి నంద్యాల తాలూకాకు, అక్కడున్న మురళీధర్‌రెడ్డి ఆళ్లగడ్డ సర్కిల్‌కు బదిలీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి టీటీడీ విజిలెన్స్‌ విభాగానికి నియమితులైనట్లు సమాచారం.

 

నంద్యాల వన్‌టౌన్‌లో పనిచేస్తున్న ప్రతాప్‌రెడ్డి ఏసీబీకి, ఆదోని పీసీఆర్‌లో ఉన్న శ్రీనివాసమూర్తి శ్రీశైలం, కర్నూలు ఎస్‌బీ–2లో ఉన్న ములకన్న నంద్యాల వన్‌టౌన్‌కు, కర్నూలు తాలూకాలో పనిచేస్తున్న నాగరాజు యాదవ్‌ను నందికొట్కూరుకు అధికార పార్టీ నేతలు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. బదిలీల్లో భాగంగా వారికి ఆయా సర్కిళ్లు దక్కే అవకాశముంది. వీఆర్‌లో ఉన్న చక్రవర్తి కూడా అధికార పార్టీ నేతల ఆశీస్సులతో ప్రాధాన్యత కలిగిన సర్కిల్‌కు నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top