'రేయ్.. శ్రీమంతానికి వచ్చి పోరా'

'రేయ్.. శ్రీమంతానికి వచ్చి పోరా'


- చింటూ, మేయర్ అనూరాధ మధ్య చివరి సంభాషణ



చిత్తూరు (అర్బన్) : చిత్తూరులో జరిగిన మేయర్ దంపతుల హత్యకేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న దుండగులతో పాటు మేయర్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే మేనల్లుడు చింటూతో మనస్పర్థలు ఉన్నా.. మేయర్ అనూరాధ అతనికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు.



మేయర్ దంపతుల కోడలు హేమలత (కఠారి ప్రవీణ్ భార్య)కు నవంబరు ఒకటో తేదీన ఇరువారంలోని ఓ మండపంలో శ్రీమంతం నిర్వహించారు. ఈ శుభకార్యానికి రావాల్సిందిగా ముందురోజు మేయర్ అనూరాధ స్వయంగా చింటూకు ఫోన్ చేశారు. ‘‘రేయ్.. పాప (హేమలత)కు శ్రీమంతం చేస్తా ఉండాము. తప్పకుండా వచ్చి పోరా..’’ అని ఫోన్‌లో చెప్పారు. దీనికి చింటూ సమాధానం ఇస్తూ. ‘‘నేను వచ్చేది మళ్లీ, ముందు నీ మొగుడ్ని జాగ్రత్తగా చూసుకో’’ అని ఫోన్ పెట్టేశాడు. అయిన వాడు, అందులోనూ అసంతృప్తితో ఉన్నాడు. మనల్ని ఏం చేస్తాడులే.. అనుకుని మేయర్ దంపతులు ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో.. ఘోరం జరిగిపోయింది.


 


అనుచరులకు చింటూ భారీ నజరానాలు..



తననే నమ్ముకున్న అనుచరులకు చింటూ భారీ నజరానాలు ఇచ్చాడా..? చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు ఆరు నెలల క్రితమే రూ.50 లక్షలను చింటూ తన అనుచరులకు పంపిణీ చేసినట్లు సమాచారం. మేయర్ హత్య కేసులో లొంగిపోయిన వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్‌లను విచారించగా వాళ్లు చెప్పిన సమాధానాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. పేద కుటుంబానికి చెందిన తనకు చింటూ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశాడని జయప్రకాష్, రాళ్లు కొట్టి పనిచేసే తనకు రూ.13 లక్షలు ఇచ్చాడని మంజునాథ్, కఠారి మోహన్ తనను ఛీ కొడితే చింటూ చేరదీసి తనకు రూ.18 లక్షలు ఇచ్చినట్లు వెంకటాచలం పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top