భార్య సెల్‌ ఫోన్ చూసి ఉన్మాదిగా..

భార్య సెల్‌ ఫోన్ చూసి ఉన్మాదిగా..

నెల్లూరు(క్రైమ్‌): అనుమానం పెనుభూతంలా మారి భార్యను భర్త హత్యచేసిన సంఘటన నెల్లూరులోని పడారుపల్లి చలపతినగర్‌లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాతపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, రమణమ్మల కుమార్తె సుమలత (26)కు అదే గ్రామానికి చెందిన ఎం.రవీంద్రబాబుతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి పవన్, మాధవ్‌లు పిల్లలు. రవీంద్రబాబు రియల్‌ ఎస్టేట్, రొయ్యల గుంతల వ్యాపారాల్లో బాగా సంపాదించాడు. నాలుగేళ్ల క్రితం రవీంద్రబాబు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె ఒంటరైంది.



భర్త చనిపోయిన నెలల వ్యవధిలోనే సుమలతకు రవీంద్రబాబు తల్లిదండ్రులు తమ రెండో కుమారుడైన శ్రీకాంత్‌తో వివాహం చేశారు. సుమలత, శ్రీకాంత్‌లు కొద్దిరోజులుగా నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో కాపురం ఉంటున్నారు. అక్కడి నుంచి పడారుపల్లికి మకాం మార్చారు. శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ నేపథ్యంలో పక్కింట్లో ఉంటున్న ఓ వ్యక్తితో భార్య సన్నిహితంగా ఉంటోందన్న అనుమానం శ్రీకాంత్‌లో మొదలైంది. ఈ విషయమై అప్పుడప్పుడూ గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన శ్రీకాంత్‌.. ఏం జరిగిందో ఏమోగానీ సోమవారం తెల్లవారుజామున నెల్లూరు చేరుకున్నాడు. భార్య సెల్‌ ఫోన్‌ పరిశీలించగా తెలియని ఫోన్‌ నంబర్లు ఉండటంతో ఎవరివని ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఆమెను తీవ్రంగా కొట్టాడు. అతని దెబ్బలు తట్టుకోలేని సుమలత.. తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తనను తీసుకెళ్లాలని చెప్పింది. తల్లిదండ్రులు ఆమెను ఓదార్చారు. అదే రోజు సాయంత్రం పక్కింటివారు సుమలత ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆస్పత్రిలో ఉందని ఫోన్‌చేసి ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం రాత్రి నెల్లూరు చేరుకున్నారు. ఇంట్లోని పడక గదిలో గల అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌లో సుమలత మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. 

 

బాత్‌రూమ్‌లో మృతదేహం...

సోమవారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ పిల్లలిద్దరినీ పిలిచి సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుక్కోమని డబ్బులిచ్చి పంపాడు. అనంతరం ఏం జరిగిందో ఏమో శ్రీకాంత్‌ ఇంట్లోనుంచి పరుగులు తీసి తన భార్య నిప్పంటించుకుందని కేకలు వేశాడు. స్థానికులు ఇంట్లోకి వెళ్లిచూడగా శ్రీలత బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉంది. స్థానికులు ఐదో నగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఇన్‌స్పెక్టర్‌ జి.మంగరావు, ఎస్‌ఐ జగత్‌సింగ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనకు శ్రీకాంత్‌ చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

 

హత్యే..

సంఘటన జరిగిన తీరును పరిశీలిస్తే సుమలత హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సుమలత మృతదేహం సగం కాలిన పరుపు మధ్యలో ఉంది. ఆత్మహత్య చేసుకుని ఉంటే కేకలు వేసేది. దీన్ని బట్టిచూస్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కిరోసిన్‌పోసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం డీఎస్‌ఆర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి ఇన్‌స్పెక్టర్‌ జి.మంగరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top