లాం..గ్‌ లీవ్‌!


ఆర్డర్‌ టు సర్వ్‌తో   ఇరుక్కుపోయిన ఉద్యోగులు

కొత్త జిల్లాలో హెచ్‌ఆర్‌ఏ కోత

జిల్లా అవతరించి    మూడు నెలలు

తుది కేటాయింపుపై   లేని స్పష్టత




జగిత్యాల :జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలకు ఉద్యోగుల కొరత ముప్పు పొంచి ఉందా..? జిల్లాస్థాయి అధికారులకూ ఉద్యోగుల సెలవు భయం పట్టుకుందా..? ఇప్పటికే వివిధ కారణాలతో లాంగ్‌లీవ్‌ పెట్టిన ఉద్యోగుల బాటలో ఇంకొందరు ఉన్నారా..? ఉద్యోగుల సెలవు సమస్య జిల్లా అభివృద్ధి ప్రగతిపై  ప్రతికూల ప్రభావం చూపనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే లాంగ్‌లీవ్‌ పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 11 జిల్లా ఆవిర్భావం రోజున... ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులతో విధుల్లో చేరిన వివిధ జిల్లాలకు చెందిన వీరు తుది కేటాయింపులపై ఆశలు పెట్టుకున్నారు. ఆ ప్రక్రియ ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో దీర్ఘకాల సెలవు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలువురు తమ పలుకుబడితో పాత స్థానాలకు బదిలీ చేయించుకోగా.. ఇంకొందరు వివిధ కారణాలతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇంకా అనేకమంది ఉద్యోగులు, అధికారులు లాంగ్‌లీవ్‌ పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ విషయంలో అనేక శాఖల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో దీర్ఘకాలిక సెలవు పెట్టి జిల్లాను వీడాలనే ఆలోచనతో ఉన్న ఉద్యోగులపై అధికారులు దృష్టిసారించారు.

జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించి నేటికి 90 రోజులవుతోంది. ఆ సమయంలో కొత్త జిల్లాల్లో తాత్కాలికంగా విధులు నిర్వర్తించాలంటూ ఆర్డర్‌ టు సర్వ్‌ కింద ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.



దీంతో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌ జిల్లాల నుంచి వందకు పైనే ఉద్యోగులు, అధికారులు జగిత్యాలకు బదిలీ అయ్యారు. కొత్త జిల్లా కార్యాలయాల్లో కరువైన కనీస వసతులు.. స్థానికంగా నివాస వసతి ఇబ్బందులతో ఉద్యోగులు ఇప్పటివరకు కాలం వెళ్లదీశారు. కరీంనగర్‌ నుంచి బదిలీ అయిన ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 20శాతం నుంచి 14.5శాతానికి పడిపోయింది. దీంతో ప్రతి ఉద్యోగి రూ. 2వేల నుంచి రూ.10వేలకుపైనే నష్టపోతున్నాడు. అయినా.. ప్రభుత్వ మాటకు కట్టుబడి ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. అప్పట్లో ప్రభుత్వం..నెల రోజుల్లో కొత్త జిల్లాల్లో ఆప్షన్లు తీసుకుని ఉద్యోగులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు ఆప్షన్లు తీసుకోకపోవడం.. కనీసం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకపోవడం.. తుది కేటాయింపులకు సంబంధించిన కసరత్తు ప్రారంభం కాకపోవడంతో ఏం చేయాలో తోచక ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇదేక్రమంలో కొత్త జిల్లాలో అభివృద్ధికి సంబంధించి పని ఒత్తిడి పెరగడంతోనూ విధుల నిర్వహణకు మొండికేస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి, తమ కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగులు లాంగ్‌లీవ్‌ పెట్టాలని నిర్ణయించారు. ఈ విషయం ఉద్యోగవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారడంతో బాధిత ఉద్యోగులందరూ దీర్ఘకాలిక సెలవులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top