కార్మిక చట్టాలు వర్తించకుండా కేంద్రం కుట్ర

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు

– కార్పొరేట్‌ యజమానుల కనుసన్నల్లో ప్రభుత్వాలు

– మంత్రి అచ్చన్నాయుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి 

– ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు

మదనపల్లె: కార్మికులకు చట్టాలు వర్తించకుండా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు ఆరోపించారు. ఆయన శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. చట్టంలో44 నిబంధనలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వాటిలో 40 నిబంధనలను పూర్తిగా సవరించి యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు. జీవో నంబర్‌ 270 మున్సిపల్‌ కార్మికుల పని భద్రతకు భంగం కలిగించేలా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాల్సి ఉందని, రాష్ట్రంలోని 1.70 లక్షల మందికి వేతన సవరణ చేసి రూ.18 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను ఫూర్తిగా రద్దుచేసి కార్మికులందరనీ పర్మినెంట్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో 63 షెడ్యూలులో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటి వరకూ జీతాలు పెంచిన దాఖలాలు లేవన్నారు. కార్పొరేట్‌ సంస్థల కనుసన్నల్లో ప్రభుత్వాలు నడవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా కార్మిక సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర మంత్రి అచ్చన్నాయుడు కనిపించకుండా పోయారని, ఆయన ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతిగా అందజేస్తామని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, ఏఐటీయూసీ జిల్లా నాయకులుు మనోహర్‌రెడ్డి, మస్తాన్, నాయకులు హైదర్‌ఖాన్, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top