ప్రక్షాళన జరిగేనా...?

ప్రక్షాళన జరిగేనా...?


అవిశ్రాంత విధులతో   నలిగిపోతున్న సిబ్బంది

తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీగా సీహెచ్‌ విజయరావు




తిరుపతి క్రైం: నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం తిరుపతి నగరం. స్థానికులు, యాత్రికులకు భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అర్బన్‌ జిల్లాలో నిత్యం దొంగతనాలు, కిడ్నాప్‌లు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ అధికస్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు కొంత మంది అధికారులు పనికి ఒకరేటు తీసుకుంటూ పోలీస్‌శాఖకు మచ్చ తెస్తున్నారు. ఈ క్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న సీహెచ్‌ విజయరావు పోలీస్‌శాఖలో ఏవిధంగా ప్రక్షాళన చేపడతారో వేచి చూడాలి. అర్బన్‌ జిల్లా 6వ ఎస్పీగా సీహెచ్‌ విజయరావు త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారు.



ఆయన ఇప్పటివరకు విజయనగరంలోని 5వ బెటాలియన్‌లో కమాండెంట్‌గా పనిచేస్తున్నారు.  ఎక్కడాలేని విధంగా తిరుపతిలోని సిబ్బందికి విశ్రాం తిలేని డ్యూటీలు ఉన్నాయి. సెలవులేని విధులు, నిత్యం వీఐపీల తాకిడి, తలనొప్పిగా మారిన ప్రొటోకాల్‌ డ్యూటీలతో కాసేపు కూడా కుటుంబ సభ్యులతో గడపలేని స్థితిలో సిబ్బంది ఉన్నారు. ఎస్పీ కార్యాలయంలో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు.  చోరీ లు, చైన్‌స్నాచింగ్‌లపై నిఘా పెంచాలి. సీసీకెమెరాలను బాగుచేయాల్సి ఉంది.



ట్రాఫిక్‌ పద్మవ్యూహం వీడేనా?

ఆక్రమణల గురవుతున్న ఫుట్‌పాత్‌లు, పెరిగిపోతున్న వాహనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను గాడిలో పెట్టేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను దృష్టిలో పెట్టుకుని ట్రా ఫిక్‌ సమస్యను పరిష్కరించాలి. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాలి. గాంధీరోడ్డు, చిన్నబజారు, కర్ణాల, టీకేస్ట్రీట్, నిమ్మకాయల వీధుల్లో వన్‌వేలు నామమాత్రంగా ఉన్నాయి. అనుమతులు లేని వాహనాలు, ఆటోలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. రద్దీగా ఉండే గాంధీరోడ్డులో షేర్‌ ఆటోలు రాకుండా చూస్తే ట్రాఫిక్‌ సమస్య తొలగుతుంది. ప్రధాన కూడల్లలో వాహనాలకు ట్రాఫిక్‌ వసతులను ఏర్పాటు చేయాలి.

ఆలయ భద్రతే కీలకం

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో శ్రీవారి ఆలయానికి భద్రత కీలకమైంది. అర్బన్‌ జిల్లా మొత్తం భద్రత ఒక ఎత్తైతే శ్రీవారి భద్రత మరొక ఎత్తు. టీటీడీ పోలీసుల సమన్వయంతో ఆలయ భద్రతను పటిష్టపరచాల్సి ఉంది. తిరుమలలో విజి లెన్స్‌ సిబ్బంది, పోలీసులు సఖ్యతగా మెలగడంలేదని ఆరోపణలున్నాయి. తిరుమలలో కిడ్నాపర్లు హల్‌చల్‌ చేస్తున్నారు. ఏడాదికాలంలో ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌కు గురయ్యారు. ఇందులో ఒక కేసును ఛేదించగా మరొకటికి భద్రతకు సవాల్‌ విసురుతోంది.



ఎర్రచందనం స్మగ్లింగ్‌

శేషాచల అటవీ ప్రాంతంలో విలువైన సంపద ఎర్రచందనం. ఈ అటవీ సంపదను ఇతర రాష్ట్రాల నుంచి సొంత ఊరు వాళ్లే కూలీలను పిలిపించి ఎర్రచందనం చెట్లు నరికి వ్యాపారం చేస్తున్నారు. ఈ ఎర్రస్మగ్లర్లు పోలీసులకు సవాల్‌గా మారారు. ఎన్ని చట్టాలు వచ్చినా... ఎన్ని టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేసినా ఎర్రచందనం అక్రమరవాణా మాత్రం పూర్తిగా అరికట్టడం సాధ్యం కాలేదు.



ప్రతి పనికీ ఓ రేటు...

తిరుపతి పోలీస్‌ జిల్లా కార్యాలయంలో కొందరు సిబ్బంది కానిస్టేబుళ్లు టీఏ, డీఏలు, పండగ అడ్వాన్సులకు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులందరూ సక్రమంగా విధులకు హాజరయ్యేలా బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేయాలి. అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సిబ్బంది అవినీతిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top