'కర్నూలు' నిర్భయ కేసులో కోర్టు సంచలన తీర్పు

'కర్నూలు' నిర్భయ కేసులో కోర్టు సంచలన తీర్పు - Sakshi


నిందితుడికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష



కర్నూలు:  బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించాలని జడ్జి ఎస్.ప్రేమావతి తీర్పు చెప్పారు. 2014లో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా కేసుల్లో ఇలాంటి తీర్పు ఇదే మొదటి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్నూలు వన్‌టౌన్ పరిధిలో ఖడక్‌పురా వీధికి చెందిన పఠాన్ ఖాజాఖాన్(28) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది జూలై 18న సాయంత్రం సమయంలో అదే వీధికి చెందిన పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు.



ఆ సమయంలో ఖాజాఖాన్ చాక్లెట్స్ చూపించి ఓ చిన్నారి(7)ని మిద్దెపైకి తీసుకెళ్లాడు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. ఉదయం 8 గంటల సమయంలో.. చిన్నారి స్నేహితులు షబానా బేగం, మరో అబ్బాయి ‘ఆటో అంకుల్ చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్లినట్లు’ చెప్పారు. ఆ వెంటనే ఖాజాఖాన్ ఇంటికి వెళ్లి చూడగా బాలిక ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. చాక్లెట్ ఇస్తానని అంకుల్ ఇంట్లోకి తీసుకెళ్లాడని, జరిగిన విషయాన్ని చెప్పింది.  



బాలిక తల్లిదండ్రులు స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితునిపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కర్నూలు డీఎస్పీ డి.వి.రమణమూర్తి 18 మంది సాక్షులను విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా నేరం రుజువు కావడంతో నిందితునికి జీవితమంతా కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రాజేంద్ర ప్రసాద్ ఈ కేసు వాదించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top