కృష్ణవేణి నమస్తుభ్యం

కృష్ణవేణి నమస్తుభ్యం

అలంపూర్‌రూరల్‌: దేశంలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి తర్వాత నాలుగో పెద్దనది కృష్ణానది. ప్రకృతిలోని అనేక వన మూలికలను తాకుతూ ప్రవహించడంతో కృష్ణానదిలోని నీరు ఔషధిసంస్కారాన్ని సంతరించుకుంది. కృష్ణానీటితో ఎన్నో క్షేత్రాలలోని అధిష్టాన దేవతలకు ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతున్నాయి. పర్వకాలాల్లో, గ్రహణ సమయాల్లో, యజ్ఞ యాగాది క్రతువుల ప్రారంభసమయంలో కృష్ణానది నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. 

 

‘‘కృష్ణవేణి ప్లవనాయ భూమౌ వాంఛతి దేవాః ఖలు మర్థ్య జన్మః

తస్య ప్రభావం సకలం ప్రవక్తుం శివో హరిర్వాబ్జ భవో నశక్త ః’’ 

కృష్ణానదిలో స్నానం చేయడం కోసం దేవతలు సైతం మనుషులుగా జన్మించాలని భావిస్తారట. అలాంటి కృష్ణానది మహిమను వర్ణించడానికి  త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణానది ప్రవహించే ప్రదేశాలన్ని కూడా పునీతం.

 

‘‘కృష్ణవేణి నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని

త్రిలోకే పావనజలే రంగాతుంగ తరంగిణి’’

కృష్ణానదిలో మనసా, వాచ, కర్మణ త్రికరఫలశుద్ధితో పుణ్యస్నానాన్ని ఆచరిస్తే సర్వపాపాలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎల్లప్పుడూ ప్రవహించే నదుల దగ్గర నివసించమని శాస్త్రోక్తి. అందుకే పూర్వం ఎంతో మంది మహర్షులు వారి జీవనాన్ని నది తీరాల్లో ఏర్పరుచుకొనేవారు. జీవనదులు అనేవి భగవంతుడు ప్రసాదించిన సంపదలు. ఆ నదుల కారణంగానే నేటి మన మనుగడుకు ధాన్యం లభిస్తోంది. అనేక పుణ్యనదులు, ఉపనదులు పుట్టిన ప్రాంతం సహ్యాద్రి పర్వతం. అలాంటి పర్వతంలోనే కృష్ణానది ఆవిర్భవించింది. మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో మహాబలేశ్వరానికి ఉత్తరం వైపు, సతారా జిల్లాలోని జోన్‌ గ్రామానికి దగ్గరలో సముద్రమట్టానికి 1337మీటర్ల ఎత్తుగా చిన్నధారగా జన్మించింది. అలా ఆవిర్భవించిన కృష్ణమ్మ 29 ఉప నదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1400 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. 

 

138 తీర్థాలు..   

కృష్ణానది మహేబలేశ్వరం వద్ద పుట్టిన దగ్గరి నుంచి సముద్రంలో కలిసే హంసలదీవి వరకు 138తీర్థాలు ఏర్పడ్డాయి. అందులో  బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, రుద్రతీర్థం మొదలుకుని అశ్వమేధఫల తీర్థం దాక అనేకం ఉన్నాయి. ఇందులో 81వ తీర్థం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం దగ్గర ఉన్న తుంగభద్రా తీర్థంగా పిలవబడుతోంది. మహాభారతంలో, బ్రహ్మాండ పురాణాలలో, విష్ణు పురాణాల్లో కృష్ణానది ప్రత్యేకస్థానాన్ని సంతరించుకుంది. 

– సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణానది స్నానం చేస్తే 60వేల సంవత్సరాలు గంగానది స్నానం చే సిన ఫలితం లభిస్తుందట. ప్రతి సంవత్సరం రవి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు చేసే స్నానమే అంతటి పుణ్య ఫలితాన్నిస్తుంటే ఇక 12ఏళ్లకు ఓ సారి చేసే పుష్కరస్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలితం దక్కుతుంది. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top