కొవ్వూరులో వడగళ్ల వాన

కొవ్వూరులో వడగళ్ల వాన

కొవ్వూరు : పట్టణంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వేసవి తాపంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం సేదతీరారు. వీధుల్లో చిన్నారులు కోలాహలంగా వర్షంలో తడుస్తూ చిందులు వేస్తూ, వడగళ్లను ఏరుకున్నారు. చాగల్లు, తాళ్లపూడి మండలాల్లోనూ వర్షం కురిసింది.  

రైతుల ఉరుకులు పరుగులు

భీమవరం : ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడి కారుమబ్బులు కమ్మాయి. జిల్లాలో కొన్ని చోట్ల వర్ష పడింది. దాళ్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ చిరుజల్లులు పడడం రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జిల్లావ్యాప్తంగా దాళ్వా పంట ఆశాజనకంగా ఉండడంతో పాటు ధర కూడా రైతులకు కొంతమేరకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో దాళ్వా మాసూళ్లతో రైతులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరికోత యంత్రాలతో మాసూళ్లు చేసిన ధాన్యం ఎక్కడికక్కడ చేలల్లోనే రైతులు ఆరబెట్టే ప్రయత్నంలో బరకాలపై వేసి ఉంచడంతో ఆకాల వర్షం ఎటువంటి నష్టం కలిగిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల ఉరుకులు.. పరుగులు

ధాన్యం ఎక్కడికక్కడ చేలలోను, రోడ్లు వెంబడి ఉంచడంతో శనివారం నాటి వర్షం జల్లులకు రైతులు బెంబేలెత్తిపోయారు. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి శ్రీలంకలోని కొమరిన్‌ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి కారణంగా శని, ఆదివారాలు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెప్పడంతో రైతుల్లో మరింత గుబులు పుట్టింది. రైతులు చేల వద్ద, రోడ్లుపైనే ఎండబెట్టిన ధాన్యాన్ని రాశులుగా చేసి చీకటిలో కూడా చార్జింగ్‌ లైట్ల వెలుతురులో భద్రపర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈదురుగాలులకు పలుచోట్ల చేలు నేలనంటాయి.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top