ఆ ఊరికి ఏమైంది?

పక్క గ్రామంలోని బావి నుంచి నీళ్లు  తెచ్చుకుంటున్న మాజేరు గ్రామస్థులు - Sakshi


వణుకుతున్న కొత్తమాజేరు

ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని జ్వరం

రెండున్నర నెలల్లో 18 మంది మృత్యువాత




సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామం భయంతో వణికిపోతోంది. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో విష జ్వరం (లక్షణాలు) సోకిన 18 మంది మ్యత్యువాత పడటం, చిన్నా పెద్దా తేడా లేకుండా జ్వరం పట్టిపీడిస్తుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సుమారు రెండు వేల జనాభా కలిగిన గ్రామంలో ప్రస్తుతం ప్రతి రెండు ఇళ్లకు ఒకరు చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.



విషయం తెలిసిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పటికే రెండుసార్లు గ్రామాన్ని సందర్శించారు. సమస్య తీవ్రతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మొదట్లోనే  స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. మే నెలలోనే ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదైనా.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించి విషయం వెలుగులోకి తెచ్చిన తర్వాతే ఒకరిద్దరు మంత్రులు మొక్కుబడిగా గ్రామాన్ని సందర్శించారు.



నెలరోజుల క్రితం ప్రభుత్వం తూతూ మంత్రంగా ఓ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. రెండురోజుల పాటు నలుగురైదుగురు వైద్యులు, ఏఎన్‌ఎంలతో హడావుడి చేసినా ప్రస్తుతం ఏ ఒక్క వైద్యుడూ లేకుండా నామమాత్రంగా నడుస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కొత్తమాజేరును సందర్శించాలని నిర్ణయించుకున్నారు.



తగ్గినట్టే తగ్గి..

జ్వరాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టడం, తక్కువ వ్యవధిలోనే ఎక్కువమంది మరణించడం గ్రామస్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన జంజనం జయలక్ష్మి జూలై 13వ తేదీన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మరుసటి రోజే ఆమె భర్త జంజనం శ్రీరాములు మరణించడంతో గ్రామంలో మరింత అలజడి రేగింది. గత మే 11 నుంచి జూలై 23 వరకు 18 మంది మరణించారు. ఒక్క మే నెలలోనే 9 మంది మరణించారు. కలుషిత జలాలే జ్వరాలకు కారణమని చెబుతున్న జిల్లా వైద్యాధికారులు.. జ్వరాల వల్ల మరణాలు సంభవించినట్లు పేర్కొనకుండా వేరే వ్యాధుల వల్ల చనిపోయినట్టుగా నమోదు చేస్తున్నారు.  



కలుషిత జలాలే కారణం

జ్వరాల నేపథ్యంలో గుక్కెడు నీళ్లు తాగాలంటేనే గ్రామస్తులు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఓ చెరువు, ఆ చెరువు నీరు ఆధారంగా ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ (నామమాత్రపు ధరకు) గ్రామం తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. పదెకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. కాలువ ద్వారా వచ్చిన నీరు చెరువులోకి చేరటం తప్ప బయటకుపోయే వీల్లేదు.



చెరువు పక్కనే ఉన్న ఫిల్టర్‌బెడ్లు పాడైపోవటంతో నీళ్లు సక్రమంగా శుద్ధికాని పరిస్థితి ఉంది. పైగా గత జనవరిలో తాగునీటి అవసరాల కోసం.. కాలువలకు నీటిని నిలిపివేశారు. ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులో ఉన్న కొద్దిపాటి నీరు కలుషితమైంది. చెరువు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లపై అధికసంఖ్యలో కోతులు చేరుతున్నాయి. అవి చెరువులోకి దిగడం, కొన్ని  చెరువులోనే పడి మృతిచెంది వాటి కళేబరాలు నీటిలోనే ఉండిపోవటంతో నీరు మరింత కలుషితమైంది.



ఇక చెరువు పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది. చెరువు నీటిని శుద్ధి చేసి గ్రామానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ నిర్వహణకు నిధులు అంతంతమాత్రంగా ఉండటం, ప్లాంట్‌లో పరికరాలు సక్రమంగా లేకపోవటం, నీరు శుద్ధి చేసినట్లే ఉన్నా నీటిలోని బ్యాక్టీరియా, ఇతరత్రాలు అలాగే ఉండిపోతున్నాయని ఇటీవల నీటి శాంపిల్స్‌కు చేసిన పరీక్షలో తేలింది.



అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం

కొత్తమాజేరులో 2,216 మంది జనాభా ఉండగా పురుషులు 1,113, మహిళలు 1,103 మంది ఉన్నారు. గ్రామస్తులు మూడు నెలలుగా జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. చెరువును శుద్ధి చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యహరించింది. కోతులు చెరువులో పడి చనిపోతున్నాయని తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు.



చెరువులో నీరు కలుషితమైందని తెలిసినా ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న చేతిపంపు, గ్రామశివారులోని పొలాల్లో ఉన్న బోరు పాయింట్ల ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు వీలున్నా ఈ దిశగా చర్యలు తీసుకోలేదు.



అన్నం పెట్టే కొడుకు, కోడలు దూరమయ్యారు

నా కొడుకు శ్రీరాములు, కోడలు జయలక్ష్మి 12 గంటల వ్యవధిలోనే చనిపోయారు. కొడుకు, కోడలు చేనేత పనిచేసి నన్ను, నా మనుమరాలు సీతమ్మను సాకేవారు. నాకిప్పుడు 80 ఏళ్లు. నేనెలా బతకాలి? మనవరాలిని ఎలా చూడాలి?

- జంజనం నాగేశ్వరమ్మ



జ్వరం నా భార్యను పొట్టనపెట్టుకుంది

నాతో పాటు నా భార్య మాణిక్యం, కుమారుడు పోతురాజు జ్వరం బారిన పడ్డాం. మాణిక్యాన్ని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా దారిలోనే చనిపోయింది.    

  - మోతుకూరి గురవయ్య



వైద్య శిబిరాన్ని కొనసాగిస్తాం..

కొత్తమాజేరులో కలుషిత నీరు సరఫరా అవుతోందని గుర్తించి అక్కడి పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈలోగానే ఎక్కువమంది విషజ్వరాల బారిన పడ్డారు. మే నుంచి జూలై వరకు 17 మంది చనిపోయారు. అయితే జ్వరం కారణంగానే చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. పరిస్థితులు చక్కబడే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తాం.

 - ఆర్.నాగమల్లేశ్వరి, డీఎంహెచ్‌వో

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top