ఫామ్‌హౌస్ నుంచే కేసీఆర్ పాలన




  -  బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి ఎద్దేవా

  తూప్రాన్
: రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచే కొనసాగిస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం తూప్రాన్‌లోని లక్ష్మీనర్సింహ్మ ఫంక్షన్‌హాల్‌లో మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి అధ్యక్షత జరిగింది. ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన సచివాలం నుంచి సాగాల్సింది పోయి సీఎం ఫాంహౌస్ నుంచి సాగుతోందన్నారు.


 


సీఎం కేసీఆర్ సచివాలయానికి వచ్చారంటేనే పెద్ద వార్త అవుతుందన్నారు. పనులపై ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినా కలవరని, అదే ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటే చాలు అక్కడే పార్టీ కండువా కప్పేస్తారన్నారు. టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకత మెదక్ జిల్లా నుంచే ప్రారంభమైందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నేడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతుందని చెప్పారు. దళిత, బీసీ, విద్యార్థి తదితర సంఘాలు తిరుగబడుతున్నాయి.


 


గూండాలకు, మాఫియాలకు టీఆర్‌ఎస్ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన కరువు నిధులను ఖర్చు చేయకుండా ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంభిస్తుందన్నారు. మిగులు బడ్టెట్ కలిగిన ధనిక రాష్ట్రమైతే ఎందుకు ఆర్‌టీసీ, విద్యుత్ చార్జీలు పెంచారో తెలపాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనన్నారు. సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం మండల పార్టీ నేతలు కిషన్‌రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top