కిరాతకం బయట పడినా..

కిరాతకం బయట పడినా.. - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం పట్టణానికి చెందిన శ్రీగౌతమి హత్య గురైందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా.. ఆ కేసులో అధికార పార్టీ నేత పాత్ర ఉండటంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఈ కిరాతక ఘటనను ప్రమాదంగా చిత్రించిన వైనంపై విద్యార్థి, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జికి అండగా ఒక ఎమ్మెల్యే రంగంలోకి దిగటం, కేసును నీరుగార్చేందుకు మరో ఎమ్మెల్యే రాజధాని స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కేసు విషయంలో పోలీసులు మౌనం వహించినట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో శ్రీగౌతమి మరణిం చిందని చెబుతూ వస్తున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన డ్రైవర్‌ దొరకడంతో హత్య కోణాన్ని ఇకనైనా బయట పెడతారా లేక ప్రమాదంగానే చూపించి కేసును మూసివేస్తారా అన్నది తేలాల్సి ఉంది. తన అక్కను కారుతో ఢీకొట్టి హత్య చేశారని ఆ ఘటనలో గాయప డిన పావని ఇప్పటికే చెప్పగా.. తాజాగా శ్రీగౌతమిని టీడీపీ నేత బుజ్జి పెళ్లాడిన ఫొటోలు బయటకు వచ్చా యి. దీంతో తన అక్కను బుజ్జి భార్య శిరీష హత్య చేయించిందని పావని చేసిన ఆరోపణలకు బలం చేకూరింది.  2016 జనవరిలో శ్రీగౌతమిని అన్నవరంలో బుజ్జి వివాహం చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. భార్య ఉండగా.. మరో యువతిని ఎలా పెళ్లి చేసుకున్నాడని.. ఆమెను వివాహం చేసుకోవడం వల్ల తలెత్తిన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి, ఏకంగా హత్య చేయించే దుర్మార్గానికి ఎలా ఒడిగట్టారని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. ఇదిలావుంటే.. ఈ కేసులో విశాఖపట్నంకు చెందిన కారు డ్రైవర్‌ కె.ప్రసాద్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు యజ మానిపైనా కేసు నమోదు చేశారు. మొత్తం నెపాన్ని వీరిద్దరిపై నెట్టేసి కేసును మూసివేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

 

రంగంలోకి విద్యార్థి, మహిళా సంఘాలు

శ్రీగౌతమిని హత్య చేయించి.. కేసును పక్కదారి పట్టించేందుకు సాగుతున్న ప్రయత్నాలపై ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్యా నాయకులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సజ్జా బుజ్జి, అతని భార్య శిరీషను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో సోమవారం రాస్తారోకో చేశారు. స్థానిక తెలగా కల్యాణ మండపంలో సమావేశమైన కాపు సంఘం ముఖ్య నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిం చారు. శ్రీగౌతమి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడాలని నిర్ణయించారు. ఇదిలావుండగా, బుజ్జి కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు సాగిస్తూనే.. కేసు విషయంలో రాజీ కుదుర్చుకునే పనికూడా సాగిస్తున్నట్టు సమాచారం. 

మసకబారుతున్న పోలీస్‌ ప్రతిష్ట

శ్రీగౌతమి హత్య కేసుతోపాటు ఇటీవల కొన్ని కేసుల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. విపక్షాలపై కేసులు పెట్టడం, వారిని అరెస్ట్‌ చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెట్టడంలో చొరవ చూపుతున్న పోలీసులు ఇలాంటి కేసుల విషయంలో చూపిం చడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీగౌతమి హత్య, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఏలూరులో వ్యక్తి ఆత్మహత్య, ఉండ్రాజవరంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు వ్యవహార శైలి విమర్శల పాలైంది. ఏలూరులో దొంగ నుంచి సెల్‌ఫోన్‌ కొన్నాడన్న ఆరోపణలతో త్రీటౌన్‌ పోలీసులు వే«ధించడంతో ఒక వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, దీన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సెక్ష¯ŒS మార్చడానికి ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదిలావుంటే.. తాజాగా ఉండ్రాజవరం మండలంలో నమోదైన చోరీ కేసుల్లో బాధితుల తెలిపిన వివరాలకు, పోలీ సులు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోయింది. వారం రోజుల వ్యవధిలో రెండు భారీ చోరీలు చోటుచేసుకోగా.. 50 కాసులకు పైగా బంగారం అపహరణకు గురైంది. దీనిపై బాధి తులు తెలిపిన వివరాలకు, పోలీసుల లెక్కలకు తేడా భారీగా ఉండటం అనుమానాలకు దారితీస్తోంది. కాల్దరి గ్రామ సర్పంచ్‌ బొల్లా సీతామహాలక్ష్మి ఈ నెల 19న శుభకార్యానికి వెళ్లివచ్చారు. నగలు బీరువాలో పెట్టి తాళం వేయడం మర్చిపోయారు. ఆ తరువాత బీరువాలోని బంగారు ఆభరణాలు లేకపోవడంతో శనివారం ఉదయం ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన ఇద్దరిని నిలదీసి.. వారిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో అపహరణకు గురైన బంగారం విలువకు.. పోలీసులు నమోదు చేస్తున్న బంగారం విలువకు వ్యత్యాసం ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇలాంటి వ్యవహారాలను సరిదిద్దకపోతే పోలీసు ప్రతిష్ట మరింత మసకబారే అవకాశం ఉంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top